పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి: ఎస్పీ జానకి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: దేశ స్వాతంత్రం కోసం ఎందరో వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని, వారందరినీ స్మరిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా ఎస్పీ జానకి ఉద్బోధించారు. అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పోలీస్ కవాతు మైదానంలో ఓపెన్ హౌస్ (Police Open House) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ, కార్యక్రమాన్ని ప్రారంభించి, పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ విభాగాల పనితీరు, పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, ఆధునిక దర్యాప్తు విధానాలు, రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ తదితర అంశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు.

ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ పోలీస్, బాంబ్ డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్, భరోసా కేంద్రం, షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీస్ కళాబృందం, కమ్యూనికేషన్ విభాగం, ఫింగర్‌ప్రింట్ యూనిట్, క్లూస్ టీమ్, సైబర్ క్రైమ్/డీ4 సీ, స్పీడ్ గన్, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు, ఆయుధాలు–మందుగుండు సామగ్రి, డయల్ 112/పీ సీ ఆర్ తదితర విభాగాలు తమ విధులకు సంబంధించిన పరికరాలు, వాహనాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించాయి.

పోలీసులు నేరస్థలాల వద్ద ఆధారాలను ఎలా సేకరిస్తారు, వేలిముద్రల ద్వారా నేర పరిశోధన ఎలా చేపడతారు, బాంబు బెదిరింపుల సమయంలో బీ డీ టీమ్ ఎలా స్పందిస్తుంది, డాగ్ స్క్వాడ్ సేవలు ఎలా ఉపయోగపడతాయి, సైబర్ నేరాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 సేవలను ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలను సంబంధిత అధికారులు విద్యార్థులకు వివరించారు.

అలాగే ట్రాఫిక్ నియమాల పాటింపు, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, మహిళలు, చిన్నారుల భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, ఆన్‌లైన్ మోసాల నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పోలీస్ శాఖలో ఉపయోగించే ఆధునిక పరికరాలు, వాహనాలను విద్యార్థులు ఆసక్తిగా పరిశీలించి, వివిధ విభాగాల అధికారులను సందేహాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి మాట్లాడుతూ.. పోలీస్ శాఖ విధులు, బాధ్యతలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించడమే ఓపెన్ హౌస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారు చూపిన సేవాభావం, అంకితభావాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమాజంలో నేరాల నివారణకు పోలీసులతో పాటు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. పోలీస్ శాఖ అందిస్తున్న సేవలను తెలుసుకోవడంతో పాటు, ప్రజల భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరుపై అవగాహన పెరగడంతో పాటు, పోలీసుల సేవలు, సవాళ్లు, ప్రజల భద్రతలో వారి పాత్ర గురించి తెలుసుకునే అవకాశం లభించింది. జిల్లా పోలీస్ శాఖ ప్రజల భద్రత, నేరాల నియంత్రణతో పాటు యువతలో చట్టాల పట్ల గౌరవం, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఈ క్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్ఉద్దీన్, ఇతర ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, ఇతర సిబ్బంది పట్టణంలోని వివిధ కళాశాలల, పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>