కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదకద్రవ్యాలు, గుట్కా, పొగాకు ఉత్పత్తులు, ఈ-సిగరెట్ల విక్రయాలపై మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు (Mahabubnagar Police) ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు గురువారం జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర్లు, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలలు, వాటి సమీపంలోని పాన్ షాపులు, కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ గుట్కా, పొగాకు ఉత్పత్తులు లేదా ఇతర మాదకద్రవ్యాలు విక్రయించరాదని దుకాణదారులను హెచ్చరించారు.
అలాగే జిల్లాలోని ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా సంబంధిత అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి, పాఠశాలల అధ్యాపకులు, సిబ్బంది, దుకాణదారులు, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యాసంస్థల సమీపంలో ఎవరైనా మాదకద్రవ్యాలు, గుట్కా లేదా ఇతర హానికర పదార్థాలను విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. తనిఖీల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Read Also: తెలంగాణలో ‘ఓటర్ల జాబితా సవరణ’.. 88 లక్షల ఓట్లు ఔట్?
Follow Us On: Instagram

