కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో జూన్ 25 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Telangana Voter List) ప్రక్రియకు ముందే భారీగా పేర్లు తొలగిస్తారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సంఘం చేపట్టిన డిజిటల్ మ్యాపింగ్, డేటా వెరిఫికేషన్ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 88,13,207 ఓటర్ల రికార్డులలో వ్యత్యాసాలను గుర్తించినట్లు తెలుస్తోంది. మొత్తం 3.39 కోట్ల ఓటర్లలో 2.32 కోట్ల మంది రికార్డులను వివిధ రాష్ట్రాల డేటాబేస్, కుటుంబ వివరాలు, నివాస చిరునామాలతో సరిపోల్చగా, దాదాపు 37 శాతం రికార్డుల్లో లోపాలు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా హైదరాబాద్లోని (Hyderabad) కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 78 శాతం రికార్డుల్లో వ్యత్యాసాలు, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోనూ భారీగా లోపాలు బయటపడ్డాయి. ఒకే వ్యక్తికి అనేక ఓటర్ ఐడీలు ఉండటం, అంతరాష్ట్ర డూప్లికేట్ నమోదులు, కుటుంబ సభ్యుల వయస్సు లాంటి సాంకేతిక లోపాలున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ 88 లక్షల రికార్డులన్నీ నకిలీ ఓట్లు కావని, వీటిని వెంటనే తొలగించబోమని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. తదుపరి దశలో బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల గుర్తింపును, చిరునామాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని తెలిపారు. మరణించిన వారి వివరాలు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, తప్పుల సవరణల ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని వివరించారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత కేవలం డూప్లికేట్, అర్హత లేని ఓట్లను మాత్రమే తొలగించి, నిజమైన ఓటర్ల పేర్లను జాబితాలోనే ఉంచుతామని అధికారులు తెలిపారు.

