కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్లు దొందూ దొందేనని, ఒకరు కొట్టినట్లు మరొకరు ఏడ్చినట్లు డ్రామాలాడుతూ ప్రజలను మభ్యపుచ్చుతున్నారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పాగా వేస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా, ఆ పార్టీ పెద్దలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 187 మంది లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తీరుపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఎన్నికల సంఘాన్ని తన తొత్తుగా మార్చుకుందని ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల ఓట్లను అన్యాయంగా తొలగించారని ధ్వజమెత్తారు. ఓట్లను రక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వమే వాటిని భక్షించిందని, ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీని ఇక్కడి ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు.
తెలంగాణ నుంచి ఢిల్లీకి ‘ఆర్ఆర్ టాక్స్’ వెళ్తోందంటూ కేంద్ర మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన విమర్శలు పూర్తిగా అర్థరహితమని మంత్రి కొట్టిపారేశారు. గతంలో తొమ్మిదన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవినీతి, అక్రమాలపై అన్ని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి సరిగ్గా ఏడాది గడుస్తున్నా.. నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ పరిణామాలే బీజేపీ, బీఆర్ఎస్ల లాలూచీ రాజకీయాలను బట్టబయలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.
తెలంగాణలో, అలాగే కేంద్రంలోనూ ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వాలే రాబోతున్నాయని మంత్రి పొంగులేటి గట్టి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావడం తథ్యమని పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, దేశవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విజయవంతంగా అమలు చేసి అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తామని ఆయన హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి, ఆత్మ కమిటీ పాలేరు నియోజకవర్గ చైర్మన్ చావా శివరామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొప్పుల అశోక్, పలువురు స్థానిక ప్రజాప్రనిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

