పాలమూరులోని 1,108 పాఠశాలల్లో ఎల్‌నినోపై విద్యార్థులకు అవగాహన

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ జిల్లాలోని 1,108 ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం ఉదయం ప్రార్థనా సమయంలో ఎల్‌నినో ప్రభావాలు, వాతావరణ మార్పులు, వాటిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన (El Nino Awareness) కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా ఆదేశాల మేరకు ఎండ తీవ్రత పెరగడం, వర్షపాతంలో మార్పులు, నీటి కొరత వంటి పరిస్థితుల గురించి విద్యార్థులకు వివరించారు.

నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించడం, తగినంత నీరు తాగడం, ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో బయట తిరగకుండా జాగ్రత్తలు పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మండల విద్యాశాఖ అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాలు నిర్వహించగా.. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకొని విద్యార్థులకు ఎల్‌నినో ప్రభావాలపై వివరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఐ. విజయకుమారి రాజాపూర్ మండల కేంద్రంలోని పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి, ఉదయం ప్రార్థనా సమయంలో విద్యార్థులతో మాట్లాడి ఎల్‌నినో ప్రభావాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం కాంప్లెక్స్ సమావేశంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణ, నీటి పొదుపు, వాతావరణ మార్పులపై విద్యార్థుల్లో అవగాహన (El Nino Awareness) పెంపొందించేలా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అదే విధంగా మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్ విద్యార్థులకు ఎల్‌నినో ప్రభావాలు, వాటిని ఎదుర్కొనేందుకు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల ద్వారా ఈ అవగాహనను వారి కుటుంబాలకు, సమాజానికి విస్తరింపజేయాలనే లక్ష్యంతో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

Also Read : ఇంధన విప్లవం.. E-20 ఇథనాల్‌కు మొక్కజొన్న..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>