కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ (Madhusudhan Naik) స్పష్టం చేశారు. జిల్లా (Mahabubnagar) కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియతో కలిసి ప్రజల నుండి ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించారు. కొంత మంది జిల్లా అధికారులు ముందస్తు అనుమతి లేకుండా ఉదయం 11 గంటల వరకు కూడా హాజరు కాకపోవడం గమనించారు.
ప్రజావాణికి హాజరుకాని జిల్లా అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు మధుసూదన్ నాయక్ తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి (Prajavani) కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలనే ఆశతో ప్రజావాణికి వచ్చి అధికారుల కోసం వేచి ఉండే పరిస్థితి ఏర్పడకూడదని పేర్కొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సంబంధిత శాఖల ద్వారా వాటిని పరిష్కరించడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు.
ప్రజావాణి కార్యక్రమానికి ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన అధికారులు తమ గైర్హాజరుపై జిల్లా కలెక్టర్కు స్వయంగా సంజాయిషీ సమర్పించాలని ఆదేశించారు. ప్రజావాణి అనేది ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని, దీనిపట్ల ఏ అధికారి కూడా నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. ప్రజల నుంచి అందిన ప్రతి వినతిని బాధ్యతాయుతంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మధుసూదన్ నాయక్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో నిర్మల, తదితరులు పాల్గొన్నారు.

