ఉపాధి హామీ పనులను వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి

కలం మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో (Mahabubnagar) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద చేపడుతున్న పనులను వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. గురువారం పెద్దమందడి మండలంలోని జంగమాయపల్లి అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం కింద నీటి నిల్వ కోసం చేపడుతున్న ట్రెంచ్‌(కందకాల) తవ్వక పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, కార్మికుల హాజరు నమోదు, ట్రెంచ్‌ల తవ్వకాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న కూలీలతో నేరుగా మాట్లాడి పనుల స్వరూపం, పని వేళలు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై ఆరా తీశారు. ఉపాధి హామీ పనుల ప్రదేశాల్లో కార్మికులకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు, ప్రథమ చికిత్స, నీడ వంటి సౌకర్యాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పామిరెడ్డిపల్లిలో రహదారి నిర్మాణ పనుల పరిశీలన

పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామంలో( పామిరెడ్డిపల్లి నుంచి బలిజపల్లి) ఎంఎన్‌ఆర్ఈజీఎస్ కింద చేపడుతున్న రహదారి నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులను వేగవంతం చేయడంతో పాటు మరింత మంది కార్మికులను సమీకరించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ కింద ఈ తరహా పనులను ఇతర మండలాల్లో కూడా అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంఎన్‌ఆర్ఈజీఎస్ పనుల అమలుపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని, కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్, డీఆర్డీఓ ఉమాదేవి, డీసీఎస్ఓ కాశీ విశ్వనాథ్, మండల స్థాయి అధికారులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>