కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం ఎలక్ట్రిక్(EV) ఆటోలను ప్రవేశపెట్టాలని చూస్తుండడానికి నిరసనగా ఈనెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి జిల్లావ్యాప్తంగా ఆటోలను బంద్ (Auto Strike) చేస్తున్నట్లు ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు రాములు యాదవ్ తెలిపారు. బుధవారం సీఐటీయూ మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కార్యాలయంలో ఆటో యూనియన్లు, సెంట్రల్ ట్రేడ్ ఇండియన్ల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు రాములు యాదవ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ యాజమాన్యం ఈవి (EV) ఆటోలను ఇవ్వాలనే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించాలని, ఆటో రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెరిగిన పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
బీఆర్‌టీయూ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు బాబుమియా మాట్లాడుతూ.. ఓలా, ఉబర్, రాపిడో యాప్‌లకు బదులుగా ప్రభుత్వం కొత్త యాప్‌ను తీసుకురావాలని, ఆటో కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తూ అక్రమంగా ఓలా, ఉబర్, రాపిడో ద్వారా నడుస్తున్న టూవీలర్లను నిషేధించి, ఆటో కార్మికులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న హామీ రూ. 12 వేలు తక్షణమే ఇవ్వాలని, రోజువారిగా ప్రజలకు సౌకర్యం కల్పించే ఆటో డ్రైవర్లకు ఈ – చలాన్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు.
టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివుడు మాట్లాడుతూ.. రోజువారిగా ప్రజలకు సౌకర్యం కల్పించే ఆటో డ్రైవర్లకు కనీస వసతులు, అడ్డాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని, జీవో నెంబర్ 263 లోని మిగిలిన ఆటోలను వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి. సురేష్ మాట్లాడుతూ.. వాహన సారథి పోర్టల్ ఆటో డ్రైవింగ్ లైసెన్సు కొనసాగించాలని, రవాణా వాహనాలకు రేడియం స్టిక్కర్స్ జీవో ఎంఎస్ నెంబర్ 60లో ఆటోలకు మినహాయించాలని, ఇందుకోసం ఆగస్టు 23 అర్ధరాత్రి నుండి జరిగే సమ్మెను, ఆటోల రవాణా బంద్‌ను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
టీయూసీఐ రాష్ట్ర నాయకులు వెంకటేష్, ఐఎన్‌టీసీ జిల్లా కార్యదర్శి ఎం. రామ్మోహన్, సీఐటీయూ టౌన్ కార్యదర్శి రాజ్ కుమార్, బీఆర్టీయూ నాయకులు నాగేష్ మాట్లాడుతూ.. గిగ్ ఫ్లాట్ ఫారం యాప్ సోషల్ సెక్యూరిటీ బోర్డులో ఆటో క్యాబ్ కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని, ఆక్సిడెంట్ భీమాను రూ. 10 లక్షల వరకు అమలుపరిచి సాధారణ మరణాలకు కూడా వర్తింపచేయలని వారు డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో షాబీర్ భాష, వినయ్, మోహన్ తదితర ఆటో డ్రైవర్ల సంఘాల నుంచి పాల్గొన్నారు. 23వ తేదీ అర్ధరాత్రి నుండి జరిగే సమ్మెకు రవాణా రంగంలోని లారీ, డీసీఎం, వ్యాను, తుఫాను, మ్యాక్సీ క్యాబ్, ఆటో క్యాబ్ తదితర రవాణా వాహన డ్రైవర్ల అందరూ సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని, ఈ సమ్మెకు ప్రజలు, ప్రజాతంత్ర వాదులు ఆర్టీసీలోని సంఘాలు, మోటార్ రవాణా రంగంపై ఆధారపడిన అనేక రంగాల కార్మికులందరూ మద్దతుగా 23వ తేదీ అర్ధరాత్రి జరిగే నిరవధిక సమ్మెకు సంపూర్ణంగా పాల్గొని మద్దతు ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు .

