కలం, ఖమ్మం బ్యూరో: పోలీస్ శాఖ, సింగరేణి సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ఉచిత శిక్షణ కార్యక్రమం అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు (Bhadradri Kothagudem SP Rohit Raju) పేర్కొన్నారు. మంగళవారం నాడు నిర్వహించిన ఈ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అభ్యర్థులను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగాల సాధనకు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధన ఎంతో కీలకమని స్పష్టం చేశారు. ప్రభుత్వం, సింగరేణి సంస్థ సంయుక్తంగా కల్పిస్తున్న ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని అభ్యర్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధ్యాపకులు అందించే సూచనలను పాటిస్తూ ప్రణాళికాబద్ధంగా చదవాలని, పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి సమయపాలన చాలా ముఖ్యమని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకొని, కష్టపడి చదివి పోలీస్ ఉద్యోగాలు సాధించే దిశగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ ఇ. శ్రీనివాస్, ఆర్ఐ ఆపరేషన్స్ బి. రవి, ఆర్ఐ వెల్ఫేర్ కృష్ణారావు, అధ్యాపక బృందం, ఇతర పోలీస్ అధికారులు మరియు శిక్షణ పొందుతున్న అభ్యర్థులు పాల్గొన్నారు.

