కలం, మధిర: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని (Madhira Water Pipeline) శ్రీనగర్ కాలనీ (10వ వార్డు) పరిధిలో మంచినీటి పైప్లైన్ పగిలిపోయి నెల రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం జేసీబీ (JCB) యంత్రాలతో తవ్వకాలు జరిపిన సమయంలో భూగర్భంలోని మంచినీటి సరఫరా పైప్లైన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో నిత్యం వందలాది లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు రోడ్లపైకి చేరి వృథాగా పోతోంది. నీరంతా రహదారిపై నిలిచిపోవడంతో కాలనీవాసులు, పాదచారులు, వాహనదారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఈ సమస్యపై కాలనీవాసులు పలుమార్లు మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానమే ఎదురవుతోంది. పైప్లైన్ మరమ్మతులతో తమకు సంబంధం లేదని, అండర్ డ్రైనేజీ పనుల కోసం తవ్వకాలు జరిపిన కాంట్రాక్టర్లే వాటిని బాగు చేయాలంటూ మున్సిపల్ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా గత నెల రోజులుగా ఎవరూ పనులు చేపట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే పగిలిపోయిన పైప్లైన్కు మరమ్మతులు చేయించి నీటి వృథాను అరికట్టాలని, రోడ్డుపై నెలకొన్న ఇబ్బందులను తొలగించాలని 10వ వార్డు ప్రజలు కోరుతున్నారు.

