కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది. సాధారణంగా ఎల్పీజీ సిలిండర్ డెలివరీ సమయంలో నమోదిత మొబైల్ నంబర్‌కు వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్ (LPG Cylinder OTP) నమోదు చేస్తేనే సిలిండర్ అందజేస్తారు. అయితే రాష్ట్రంలో ఇటీవల సంభవించిన అర్నబ్ తుఫాన్ కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులకు అంతరాయం కలగడంతో పాటు మొబైల్ నెట్‌వర్క్ టవర్లు దెబ్బతిని కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది.
ఈ తీవ్ర ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా వినియోగదారులు ఓటీపీలు పొందలేక ఇబ్బందులు పడుతున్నందున, ఓటీపీ ధృవీకరణ నిబంధన నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు తుఫాన్ ప్రభావిత శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి , కాకినాడ , డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ , తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో వినియోగదారులు నగదు చెల్లింపు పద్ధతిలోనే నేరుగా సిలిండర్లను పొందేందుకు అనుమతి ఇచ్చారు.
క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా, నెట్‌వర్క్ టవర్ల పునరుద్ధరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని పౌరసరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి. టెలికాం సేవలు సాధారణ స్థితికి చేరుకునే వరకు ఈ విధానం అమల్లో ఉంటుందని, ఏజెన్సీలు ఎటువంటి అదనపు రుసుములు వసూలు చేయకుండా తక్షణమే సిలిండర్లను సరఫరా చేయాలని స్పష్టం చేశారు.

