గుడ్‌న్యూస్.. నేడు రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో రబీ సీజన్ సాగుకు సిద్ధమవుతున్న రైతాంగానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీపి కబురు అందించాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ (Annadata Sukhibhava) రెండో విడత ఆర్థిక సహాయాన్ని రబీ అవసరాల దృష్ట్యా అనుకున్న సమయం కంటే ముందే అక్టోబర్ 30న నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా ప్రధాని మోదీ గుజరాత్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పీఎం కిసాన్ 24వ విడత కింద దేశవ్యాప్తంగా ఉన్న 9.34 కోట్ల మంది రైతులకు రూ.18,680 కోట్లు విడుదల చేయనున్నారు. దీనిలో ఒక్కో లబ్ధిదారునికి రూ.2,000 చొప్పున జమ కానున్నాయి.

దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటాగా ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.4,000 కలిపి, మొత్తం ప్రతి రైతు కుటుంబానికి రూ.6,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రస్తుతం స్థానిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదా ఆర్భాటాలు లేకుండా పారదర్శకంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో నిధులు బదిలీ చేస్తున్నారు. దీంతె రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,85,838 మంది అర్హులైన రైతు కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రూ.3,125 కోట్లకు పైగా సొమ్ము చేరనుంది. ఇందులో ఏపీ ప్రభుత్వం రూ.2,342.92 కోట్ల వాటాను భరించగా, కేంద్ర పీఎం కిసాన్ వాటా కింద రూ.782.55 కోట్లు విడుదల కానున్నాయి.

ఇటీవల సంభవించిన ‘అర్నాబ్’ తుఫాను తీవ్రత వల్ల పంట నష్టపోయి ఆవేదనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు ఈ నగదు జమ ఊరటనివ్వనుంది. విత్తనాలు, ఎరువుల కొనుగోలుతో పాటు ఇతర వ్యవసాయ పెట్టుబడులకు ఈ సాయం సమయానికి అందుతుండటంతో రబీ సాగుకు రైతులకు పెద్ద ఎత్తున భరోసా లభించినట్లయింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>