కలం, నల్లగొండ బ్యూరో : ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట (Suryapet) జిల్లా తిరుమలగిరి మండలంలోని వెలిశాల గ్రామ సమీపంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో హైదరాబాద్ వైపు వెళుతోంది. అదే సమయంలో తిరుమలగిరి నుంచి తొర్రూరు వెళ్తున్న లారీ వెలిశాల గ్రామ సమీపంలోకి రాగానే అదుపుతప్పి వేగంగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.
దీంతో బస్సులోని పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమయింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీశారు. చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి (Suryapet Govt Hospital) తరలించారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై వాహనాలు బారులుదీరగా, క్రేన్ సాయంతో ధ్వంసమైన రెండు వాహనాలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: ఇక యుద్ధమే..! టీవీకే విజయ్ పై రజినీ ఫ్యాన్స్ ఫైర్
Follow Us On: Instagram

