కలం, వెబ్డెస్క్: ఎవరైనా కలెక్టర్కు పెన్షన్ రావడం లేదనో.. భూ సమస్యలు ఉన్నాయనో.. లేక గ్రామంలో ఉన్న ఇబ్బందుల గురించో ఫిర్యాదు చేస్తారు. కానీ, కర్నూలు (Kurnool) జిల్లాలో ఓ యువకుడు తాను హైట్ తగ్గిపోతున్నానని కలెక్టర్కు ఫిర్యాదు చేయడం స్థానికంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. జిల్లాలోని పులకుర్తికి చెందిన యూపీఎస్సీ అభ్యర్థి (UPSC Aspirant) సుధాకర్ కొద్ది రోజులుగా తాను వింత సమస్యతో బాధ పడుతున్నానని కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. రాత్రి సమయంలో హైట్ తగ్గిపోతున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సుధాకర్ హైదరాబాద్లో యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. అతడి అన్న రెండేళ్ల క్రితం చనిపోయాడు. అయితే, తన అన్నను ఊరిలో గొడవల కారణంగా చేతబడి చేసి, మానసికంగా హింసించి కొందరు చంపేశారని ఆరోపిస్తున్నాడు. అప్పటి నుంచి తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో తనకు ఎవరో చేతబడి చేశారన్న అనుమానం ఉందని కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను పగలు సాధారణంగానే ఉన్నా రాత్రి సమయంలో మాత్రం తన ఎత్తు తగ్గిపోతుందని సుధాకర్ ఆరోపిస్తున్నాడు. ఈ సమస్య గురించి ఇప్పటికే తాను ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగానని, అయినా ఎలాంటి లాభం లేదని చెప్తున్నాడు. ప్రస్తుతం యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆపేసి ఊర్లోనే ఉంటున్నానని చెప్తున్నాడు. దీంతో తన సమస్యకు చేతబడి కారణమని భావిస్తూ, ఈ చర్యలకు పాల్పడ్డ వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

