కార్మిక, పేదల పక్షపాతి ఖాదర్ బాబు: కూనంనేని

కలం, ఖమ్మం బ్యూరో: పేద ప్రజలు, కార్మికులతో మమేకమై తుదిశ్వాస వరకు వారి అభ్యున్నతి కోసం శ్రమించిన ఉప్పుశెట్టి ఖాదర్ బాబు (Kunamneni SambaSiva Rao) ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సీపీఐ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా సమితి సభ్యులు, ప్రముఖ న్యాయవాది, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఉప్పుశెట్టి ఖాదర్ బాబు 9వ వర్ధంతిని ఆదివారం పాల్వంచలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్వంచలోని రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న ఖాదర్ బాబు స్మారక స్థూపం వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా పార్టీ అరుణ పతకాన్ని ఆవిష్కరించారు.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూనంనేని హాజరై మాట్లాడారు. ఏఐఎస్ఎఫ్ నేతగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఖాదర్ బాబు అంచలంచలుగా జిల్లా స్థాయి నేతగా, పేదల నాయకుడిగా ఎదిగారని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ వాటి పరిష్కారానికి అనునిత్యం శ్రమించేవారని, పాల్వంచ ప్రాంత ప్రజలను కమ్యూనిస్టు ఉద్యమాల వైపు మళ్లించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన లేని లోటు వ్యక్తిగతంగా తనకు బాధాకరమని, బాబుతో ఉన్న మధుర స్మృతులను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.

మున్సిపల్ ప్రజాప్రతినిధిగా, న్యాయవాదిగా, ప్రజా నాయకుడిగా పాల్వంచ ప్రాంతంలో ఖాదర్ బాబు చెరగని ముద్ర వేశారని కూనంనేని కొనియాడారు. ఖాదర్ బాబు ఆశయాలను సాధించిన నాడే ఆయనకు నిజమైన నివాళులర్పించినట్లు అవుతుందని అన్నారు. నాయకులు, కార్యకర్తలు ఈ బాధ్యతను స్వీకరించి ఆయన ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు సాగిస్తూ పాల్వంచ ప్రాంతంలో సీపీఐని అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్, అడుసుమిల్లి సాయిబాబా, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>