కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ జలదోపిడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ల విషయంలో తెలంగాణకు ఆది నుంచి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ లో సొరంగాలు తవ్వి నీటిని దోపిడి చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని కేటీఆర్ నిలదీశారు.
నాగార్జున సాగర్ ను తెలంగాణకు కాకుండా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. మంచినీటి పథకం పేరిట ఎలాంటి అనుమతి లేకుండా ఏపీ జలదోపిడి చేస్తోందన్నారు. చంద్రబాను, మోదీ, రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పాలమూరుకు, నల్గొండ జిల్లాకు నీళ్ల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పాలమూరును వలస జిల్లాగా మార్చింది, నల్గొండకు ఫ్లోరోసిస్ బహుమతిగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని కేటీఆర్ ధ్వజమెత్తారు. జాయింట్ ప్రాజెక్టుగా నాగార్జునసాగర్ ను కట్టి నల్గొండకు అన్యాయం చేశారన్నారు.
సమైక్య రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు నుంచి.. ఇప్పుడు సాగర్ నుంచి నీళ్లు తీసుకెళ్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. తాగునీరు పేరు చెప్పి 90TMCల నీళ్లను తీసుకెళ్లేందుకు ఏపీ ప్లాన్ చేస్తుందన్నారు. సాగర్లో 510 అడుగుల కంటే కింద నుంచి నీళ్లు తోడుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డికి పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్ తో పాటు శ్రీశైలంలో కూడా జలదోపిడి జరుగుతుందని కేటీఆర్ ఆరోపించారు.

