కలం, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరం (Suryalanka Beach) లో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన ఓ వ్యక్తి సముద్రంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటన బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన షేక్ వలీ(40) 15 మంది స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సూర్యలంక బీచ్ విహార యాత్రకు వెళ్లారు.
అందరూ కలిసి సముద్ర స్నానానికి దిగిన సమయంలో షేక్ వలీ ప్రమాదవశాత్తు లోతుగా ఉన్న ప్రాంతానికి వెళ్లారు. ఒక్కసారిగా ఎగసిపడిన అలల ఉధృతికి సముద్రంలో కొట్టుకుపోయి మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, ఇటీవలి కాలంలో సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు విహారయాత్రలకు వెళ్లి పలువురు గల్లంతైన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోవడం వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతుంది. ఏది ఏమైనా సముద్రాల వద్దకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

