కలం, పెద్దపల్లి: న్యాయాన్ని రక్షించి పేదలకు న్యాయం చేయాల్సిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవినీతి సొమ్ముకు ఆశపడ్డాడు. న్యాయదేవతకు కల్లుగప్పి శిక్ష పడాల్సిన నిందితుల నుంచే లంచం తీసుకున్నాడు. న్యాయస్థానంలో కేసు విచారణను నిందితులకు అనుకూలంగా మారుస్తానని నమ్మబలికాడు. ఈ క్రమంలో భారీ మొత్తంలో లంచం తీసుకుంటున్న ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం ఈ ఘటన (Peddapalli ACB Raid) చోటుచేసుకుంది.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 2023లో ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో జరిగిన ఒక భూ వివాదం ఘర్షణకు దారితీసి, ఒకరి మృతికి కారణమైంది. ఈ ఘటనపై మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు వ్యక్తులపై హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో విచారణ దశలో ఉంది.
రూ.2 లక్షలకు బేరం.. రూ.1.50 లక్షలు తీసుకుంటూ..
ఈ కేసులో నిందితులకు శిక్ష పడకుండా విచారణ సమయంలో వారికి అనుకూలంగా వ్యవహరించి లబ్ధి చేకూరుస్తానని పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ బేరం కుదుర్చుకున్నారు. ఇందుకు గాను రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో బాధితులు కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
వలపన్ని పట్టుకున్న అధికారులు:
బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలోని బృందం పక్కా ప్రణాళికతో వలపన్నింది. బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిందితుల తరఫు వారి నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ రూ.1.50 లక్షల నగదును లంచంగా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రవీందర్ వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని రసాయన పరీక్షలు నిర్వహించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

