కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు (KTR) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిది ‘దండుపాళ్యం ముఠా’ అని, ఆయన ఒక గజదొంగ అయితే.. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) ఒక ఘరానా దొంగ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా పాలేరు (Paleru) నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అరాచకాలతో రాష్ట్రాన్ని దివాళా తీయిస్తోందని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హిట్లర్ ఆదర్శమని, ఆయనో ‘సాడిస్ట్’ లాగా మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. “నేను దేన్నైనా కూలగొట్టేస్తాను” అంటూ రేవంత్ రెడ్డి (Revanth Reddy) గర్వంగా చెప్పుకుంటున్నారని, వెలుగుమట్లలో రాత్రికి రాత్రి పేదలకు చెందిన వెయ్యి ఇళ్లను కూల్చివేసి రాక్షస ఆనందం పొందారని ధ్వజమెత్తారు. పేదలు, ఆడబిడ్డలు రోడ్డున పడి ఏడుస్తుంటే ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి దండుపాళ్యం ముఠాకు నాయకుడైతే, ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు హిట్లర్ వద్ద పనిచేసే ‘గోబెల్స్’ను మించిపోయారని ఎద్దేవా చేశారు.
ఖమ్మం జిల్లా మంత్రులపై కేటీఆర్ (KTR) తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. రాష్ట్ర రెవెన్యూ పడిపోతుంటే, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అవినీతి సామ్రాజ్యం మాత్రం వందల, వేల రెట్లు పెరుగుతోందన్నారు. ఆయన సంపాదించిన అక్రమ సొమ్మును లెక్కించడానికి నోట్లు లెక్కించే యంత్రాలు కూడా అలసిపోతాయంటూ, ఆయనను “బాంబుల మంత్రి” అని సంబోధించారు. ఇరవై లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన తర్వాతనే ఓట్లు అడుగుతామని మంత్రి పొంగులేటి చెప్పడంపై మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ రెండున్నరేళ్లలో 10 లక్షల ఇళ్లు కట్టారా చెప్పాలని ప్రశ్నించారు. 20 లక్షల ఇళ్లు కట్టకపోతే ఓట్లు అడగమనే మాట మీద నిలబడే దమ్ము ఉందా? అని సవాలు విసిరారు. ఆ 20 లక్షల ఇళ్లు తమ సొంత నిధులతో కడతారా? అని ఎద్దేవా చేశారు.
గడిచిన పుష్కర కాలంలో నీళ్లతో, నిధులతో, సంక్షేమ పథకాలతో ఎంతో పుష్కలంగా విలసిల్లిన తెలంగాణ, నేడు ఈ “ముష్కరుల” పాలనలో తీవ్ర ఇబ్బందుల పాలవుతోందని కేటీఆర్ ఆరోపించారు. పాలేరులో కాంగ్రెస్ దుకాణం బంద్ కావడం ఖాయమని, మళ్లీ తాము గెలవలేమనే భయంతోనే “దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి” అన్న చందంగా విచ్చలవిడిగా దోపిడీకి తెగబడుతున్నారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అనంతరం సర్ ప్రక్రియపై బీఆర్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన కల్పించారు.
Read Also: మనమే ఫేమస్ కపుల్.. మోదీతో ఇటలీ ప్రధాని మెలోని సంభాషణ
Follow Us On : WhatsApp

