కలం, వెబ్ డెస్క్: త్వరలోనే జరగబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల (Graduate MLC Elections)పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమీక్ష చేశారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల నాయకులతో తెలంగాణ భవన్‌లో విడిగా సమావేశం అయ్యారు. నోటిఫికేషన్ వచ్చే లోపు.. ప్రతి గ్రాడ్యుయేట్‌ను ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఇప్పటి నుంచే ఆ కార్యక్రమం ప్రారంభించాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. తమను మోసం చేసిందనే భావనలో ఉన్నారని కేటీఆర్ వివరించారు. ఆ వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మార్చుకునేలా ఆయా జిల్లాల నాయకులు పకడ్బందీ వ్యూహాలు సిద్ధం చేసుకోవాలన్నారు. గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, ఖమ్మం, నల్లగొండ పరిధిలోని బీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
అభ్యర్థి కాదు, పార్టీ గుర్తే ప్రధానం..
ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎవరినీ నియమించినా పార్టీ నేతలు కష్టపడి పనిచేయాలని కేటీఆర్ సూచించారు. ఈ ఎన్నిక పార్టీ గుర్తు మీదనే ఉంటుంది కాబట్టి.. అంతా ఐకమత్యంతో పనిచేసి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మరో రెండు రోజుల్లో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలతో కూడా సమావేశం కాబోతున్నట్లు వెల్లడించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయడంతో పాటు నిరుద్యోగులు, యువతను ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందనే అంశాలను వారికి వివరించాలని సూచించారు.

