కలం, ఖమ్మం బ్యూరో: గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యాన్ని సహించేది లేదని, నిర్దేశిత కాలపరిమితిలోనే పనులన్నీ పూర్తి కావాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా భూసేకరణ, టెండర్ల ప్రక్రియలో ఆలస్యం చేయకుండా వెంటనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. శనివారం గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, టైర్-2, టైర్-3 అభివృద్ధి పనుల పురోగతిపై నిర్వహించిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ.. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులన్నింటినీ వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే టెండర్లు పూర్తయిన పనులను ఆలస్యం చేయకుండా తక్షణమే పట్టాలెక్కించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే తాటిపైకి వచ్చి, పరస్పర సమన్వయంతో లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. భద్రాచలంలో గోదావరి పుష్కరాల కోసం చేపడుతున్న ఏర్పాట్లను వివరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పుష్కర ఘాట్ల నిర్మాణం, ఆలయాల పునర్నిర్మాణం అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణతో పాటు మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, అవసరమైన భూమిని సంబంధిత శాఖలకు అప్పగిస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సాంకేతిక, పరిపాలనా పరమైన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, సమగ్ర సమన్వయంతో పుష్కర పనులను గడువులోగా పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు.

