జిల్లా పర్యాటక ప్రదేశాలపై ప్రచారం అవసరం: కలెక్టర్ రిజ్వాన్ బాషా

కలం, జోగులాంబ గద్వాల: విద్యార్థులు జిల్లాలోని చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక ప్రదేశాల విశిష్టతను తెలుసుకుని వాటి ప్రాధాన్యతపై సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని గద్వాల జిల్లా కలెక్టర్ (Gadwal Collector) రిజ్వాన్ బాషా షేక్ (Rizwan Basha Shaik) సూచించారు.

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం గద్వాలలోని ప్రభుత్వ మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి భారీ నిధులు

రాష్ట్రంలోని వెలుగులోకి రాని పర్యాటక ప్రాంతాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవానికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిజాం కొండ, బీచుపల్లి, అలంపూర్ ఆలయాలను మరింత అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

పురాతన కట్టడాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

గద్వాల చేనేత చీరల ప్రాముఖ్యతపై కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ, ఇక్కడ చేనేత పార్క్ నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం టూరిస్ట్ గైడ్‌ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తుందని అన్నారు. జిల్లాలోని పలు ప్రాచీన కట్టడాలను ఇప్పటికే పురావస్తు శాఖ గుర్తించిందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.

గద్వాల పర్యాటక అభివృద్ధికి అపార అవకాశాలు

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యాటక అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు, రహదారులు, వసతి, పారిశుధ్య సౌకర్యాలను మెరుగుపరిస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు.

తద్వారా స్థానిక యువతకు ఉపాధి, వ్యాపారులకు ఆదాయ అవకాశాలు పెరగడంతో పాటు జిల్లా ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యాసంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

పర్యాటక అభివృద్ధితో స్థానిక యువతకు ఉపాధి

జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పర్యాటక రంగం అభివృద్ధి ఒక ప్రాంత అభివృద్ధికి మాత్రమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి, వ్యాపారులకు అవకాశాలు, ప్రభుత్వానికి ఆదాయం కల్పించే కీలక రంగమని అన్నారు. పర్యాటకులు పెరిగే కొద్దీ హోటళ్లు, రవాణా, గైడ్ సేవలు, స్థానిక ఉత్పత్తులు, హస్తకళలు తదితర రంగాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

ప్రపంచంలోని అనేక దేశాలు పర్యాటక రంగాన్ని ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఆధారంగా చేసుకుని ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. అలంపూర్ జోగులాంబ ఆలయం, బీచుపల్లి, నదీ పరివాహక ప్రాంతాలు తదితర ప్రాంతాలను ప్రోత్సహించడం ద్వారా జిల్లాకు ప్రత్యేక పర్యాటక గుర్తింపు తీసుకురావచ్చని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో భద్రత, పారిశుధ్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవసరమన్నారు.

అనంతరం పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే గద్వాల మెడికల్ కళాశాలలో వివిధ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు.

ఈ కార్యక్రమంలో గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ జయలక్ష్మి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి రామలింగేశ్వర గౌడ్, కళాశాల ప్రిన్సిపల్ షేక్ కలందర్ బాషా, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>