కలం, వెబ్ డెస్క్: మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ డీపీఆర్ తయారీ, ఇండ్ల కూల్చివేత, భూ సేకరణ, ప్రాజెక్టు వ్యయం పెంపు, ప్రభుత్వం చేస్తున్న విభిన్న ప్రకటనలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్ తయారీ మెయిన్‌హార్ట్ అనే కంపెనీకి ఇచ్చారని.. ఈ కంపెనీని సింగపూర్, పాకిస్తాన్, భారతదేశంలోని అనేక సంస్థలు బ్యాన్ చేశాయని మండిపడ్డారు. గతంలో ఇదే అసెంబ్లీలో డీపీఆర్ తయారీకి కనీసం 18 నెలలు పడుతుందని చెప్పారని.. కేవలం రెండు నెలల్లోనే ఇప్పుడు డీపీఆర్ ఏ విధంగా తయారయిందని ప్రశ్నించారు. ఒకవేళ రెండు నెలల్లోనే అద్భుతమైన వేగంతో చమత్కారం చేసి డీపీఆర్ సిద్ధం చేస్తే, దాన్ని సభలో ప్రజల ముందు పెట్టాలని చమత్కరించారు.
మూసీకి ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) రుణం ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని సభలోనే శ్రీధర్ బాబు చెప్పారని అన్నారు. కానీ ఆ బ్యాంక్ వారిని తాము అడిగితే, జనవరి 23వ తేదీన ఎలాంటి డీపీఆర్ తమకు రాలేదని, కాబట్టి లోన్‌కు సంబంధించిన ఎలాంటి అంగీకారం లేదు అని స్పష్టం చేసిందని చెప్పినట్లు తెలిపారు. ఇదే నెల మార్చి 11వ తేదీన ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఎలాంటి లోన్ ఇవ్వడం లేదనే మాటను స్పష్టంగా మరోసారి చెప్పిందన్నారు.
ప్రభుత్వం తమ సమాచారాన్ని సరిదిద్దుకోవాలని కేటీఆర్ సూచించారు. లేని పక్షంలో కావాలనే ప్రజలని, సభను తప్పుదోవ పట్టిస్తుందని అనుకోవాల్సి వస్తుందన్నారు. 16 వేల కోట్ల రూపాయలతో అయిపోయే ఈ ప్రాజెక్టునే లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. లక్షన్నర కోట్లు అని ముఖ్యమంత్రి చెప్తుంటే, సభలో మాత్రం నాలుగు, ఐదు వేల కోట్లు అని చెప్తున్నారని మండిపడ్డారు. అయితే ఎన్ని దశల్లో ఈ ప్రాజెక్టును చేస్తారు? ఎన్ని రకాల భూసేకరణ, ఇళ్లను కూలుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
సభలో శ్రీధర్ బాబు 1400 ఇళ్లు కూలుస్తామని చెప్పారు, కానీ ప్రభుత్వ గెజిట్‌లో మాత్రం 10 వేలకుపైగా ఇళ్లు కూలుస్తామని ప్రకటన ఇచ్చారని అన్నారు. అదే గెజిట్‌లో 3260 కి పైగా ఎకరాలను సేకరిస్తామని తెలిపారని చెప్పారు. లక్షన్నర కోట్ల రూపాయలు అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు నాలుగు, ఐదు వేల కోట్లకు ఏ విధంగా తగ్గించారు? అని ప్రశ్నించారు. బఫర్ జోన్‌ను విస్తరించామని స్థానిక ఆర్డీవో చెప్తున్నారని.. అసలు బఫర్ జోన్‌ను ఎంతకు పెంచారు? అని అడిగారు. ఏ విధంగా పెంచారో స్పష్టం చేయాలని.. ఎన్ని ఇళ్లను కూలుస్తారు? ఎన్ని వేల ఇళ్లను కూల్చే ప్రతిపాదనలు ఉన్నాయి అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు.

