కలం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ (BRS ) లో బావబామ్మర్దుల రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై దాడుల్లో మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ ఇద్దరూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకరు రాజకీయంగా పైచేయి సాధిస్తున్న సమయంలో, మరొకరు కీలక అంశంతో ముందుకొస్తున్నారు. ఇది యాదృచ్ఛికమా? లేక రాజకీయ ప్రాధాన్యం కోసం జరుగుతున్న సహజ పోటీనా? అనే చర్చ బీఆర్ఎస్ శ్రేణుల్లో వినిపిస్తోంది.
గత వారం రోజులుగా రాష్ట్ర అప్పులు, ఆర్థిక పరిస్థితి, గురుకుల టెండర్ల అంశాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ తరహాలో పాలిటిక్స్ వేడెక్కాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు రిజర్వుబ్యాంకు లెక్కలు, కాగ్ నివేదికలను ప్రస్తావిస్తూ వరుస పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. ప్రభుత్వ గణాంకాలు తప్పు అంటూ బహిరంగ సవాల్ విసిరారు. చర్చకు సిద్ధమంటూ రోడ్డుమీదికి వచ్చారు. కేటీఆర్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లకు పరిమితమయ్యారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ తరఫున హరీశ్‌రావు అప్పర్ హ్యాండ్ సాధించారన్న అభిప్రాయం బీఆర్ఎస్ కేడర్‌లో వ్యక్తమైంది. ఇదే క్రమంలో తాజాగా కేటీఆర్ కాళేశ్వరం ఇష్యూతో కన్నెపల్లి పంపుహౌస్ వద్దకు తన అనుచరులతో తరలివెళ్లారు. గత బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావు ఈ పర్యటనలో లేకపోవడం బీఆర్ఎస్ కేడర్‌లో చర్చకు దారితీసింది.
కన్నెపల్లికి కేటీఆర్.. కనిపించని హరీశ్
కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి మొదలు మంత్రులంతా ‘కూలేశ్వరం’ అని సెటైర్ వేస్తుండడంతో ఆ ఇష్యూని కేటీఆర్ టేకప్ చేశారు. అప్పుల ఇష్యూలో కేటీఆర్‌కు ఆశించినంత మైలేజ్ రాలేదనే అభిప్రాయం బీఆర్ఎస్ శ్రేణుల్లోనే వినిపించింది. దీంతో హఠాత్తుగా కన్నెపల్లి పంప్‌హౌస్ టూర్ చేపట్టారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు ఈ టూర్లో కనిపించలేదు. సాగునీటిపారుదల అంశాల్లో, ప్రాజెక్టుల విషయంలో లోతైన అవగాహన ఉన్న హరీశ్‌రావును కేటీఆర్ ఆహ్వానించలేదా?.. లేకుంటే హరీశ్‌రావే ఆసక్తి చూపలేదా?.. లేక ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉన్నారా?.. ఇలాంటి గుసగుసలు బీఆర్ఎస్లో మొదలయ్యాయి. అప్పుల అంశంలో హరీశ్‌రావుకు వచ్చిన మైలేజీని అధిగమించాలనే కన్నెపల్లి టూర్లో కేటీఆర్ అన్నీ తానై వ్యవహరించారన్న మాటలు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. పోలీసులు అడ్డుకోవడం, వాగ్వాదం చోటుచేసుకోవడం, ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్ విసరడం, 50 వేల మంది రైతులతో వచ్చి మోటార్లను ఆన్ చేస్తానని ప్రకటించడం వంటి పరిణామాలతో మీడియా స్పేస్‌ను ఆయన ఆక్రమించారనే చర్చ నేతల్లో నెలకొంది.
కంటికి కనిపించని తీరులో..!
బీఆర్ఎస్లో బావబామ్మర్దులు హరీశ్ రావు, కేటీఆర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నదనేది తెలంగాణభవన్‌లో ఓపెన్‌గా వినిపించే మాట. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న కొన్ని ఉదాహరణలు దీనికి బలం చేకూర్చినట్లయింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేటీఆర్ చర్చలో పాల్గొనగా.. ప్రెస్ మీట్ పేరుతో హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌పై చర్చలో హరీశ్‌రావు కీలక పాత్ర పోషిస్తే.. కేటీఆర్ చిట్‌చాట్ పేరుతో మీడియా ప్రతినిధులకు కొన్ని సెన్సేషనల్ ఇన్పుట్స్ ఇచ్చారు. ఇలాంటి ఆనవాయితీ అప్పటి నుంచీ కంటిన్యూ అవుతున్నది. రాష్ట్రంలో ‘సర్’ మొదలుకాబోతున్న సమయంలో కేటీఆర్ నియోజకవర్గాలవారీగా సన్నాహక సమావేశాలతో జిల్లాల్లో పర్యటించారు. కేవలం సిద్దిపేట్, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు హరీశ్‌రావు పరిమితం కాకుండా.. ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వరంగల్, హన్మకొండ, జనగాం వంటి జిల్లాల్లో పర్యటించారు. ఒకరిపై మరొకరు అప్పర్ హ్యాండ్ సాధించేలా, మీడియాలో స్పేస్‌ను ఆక్యుపై చేసేలా కంటికి కనిపించని తీరులో పోటాపోటీగా వ్యవహరిస్తున్నారనే టాక్ బీఆర్ఎస్ కేడర్ లో నెలకొన్నది. ఇప్పుడు అప్పుల ఇష్యూలో, కాళేశ్వరం ఇష్యూలోనూ అదే కనిపించిందని వారు అనుకుంటున్నారు.
హరీశ్ నెక్స్ట్ యాక్షన్ ఏమిటి?
కన్నెపల్లి టూర్‌తో ఒక రోజంతా కేటీఆర్ హైలైట్ కావడంతో హరీశ్‌రావు తదుపరి చర్యలు, టేకప్ చేయబోయే ఇష్యూ ఏంటనేది బీఆర్ఎస్ లో ఆసక్తికరంగా మారింది. పార్టీలో నేతల మధ్య వివాదాలు, నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీతో గట్టి పోటీ ఉన్న సమయాల్లో హరీశ్‌రావుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బాధ్యతలు అప్పజెప్పేవారు. సమస్యను పరిష్కరించడంపై దిశానిర్దేశం చేసి అక్కడికి పంపేవారు. దీంతో ఆయనకు పార్టీలో ‘ట్రబుల్ షూటర్’ అనే గుర్తింపు వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు.. కాళేశ్వరం అంశంపై 2024లో అసెంబ్లీలో చర్చలో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవకతవకల ఆరోపణలు రావడంతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎంక్వయిరీకి సైతం హరీశ్‌రావు హాజరై వివరణ ఇచ్చారు. ఆ ప్రాజెక్టు ప్రస్తావనకు రావడంతోనే కేసీఆర్, హరీశ్‌రావు పేర్లు బీఆర్ఎస్ శ్రేణులకు గుర్తుకొస్తాయి. ఇప్పుడు కేటీఆర్ ఆ ఇష్యూను టేకప్ చేయడం, కన్నెపల్లి పంప్‌హౌస్ టూర్లో హరీశ్‌రావు కనిపించకపోవడం సరికొత్త చర్చకు, అనుమానాలకు తావిచ్చినట్లయింది.

