కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంలో వేలాది ఎకరాల భూమి రాత్రికి రాత్రే మాయమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. తమ ప్రభుత్వం తెచ్చిన ధరణిని లేపేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. భూ భారతి పోర్టల్ తెచ్చి దందాలు చేస్తున్నారని విమర్శించారు. వీరప్పన్ అటవీ శాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో.. రియల్ ఎస్టేట్ చేసే రేవంత్ రెడ్డి సీఎం కావడంతో పరిస్థితి అలా మారిపోయిందన్నారు.
తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు..
సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి చేస్తున్న భూ దందాలకు అంతే లేకుండా పోయిందని కేటీఆర్ విమర్శించారు. ‘తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు’ అన్నట్లుగా సీఎంతో పాటు ఆయన తమ్ముడు కొండల్ రెడ్డి అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థకు సమాంతరంగా చీకట్లో మరో వ్యవస్థ నడుస్తోందన్నారు. రాత్రికి రాత్రే దళితులు, గిరిజనుల అసైన్డ్ భూములు మాయం అవుతున్నాయని దుయ్యబట్టారు.

