కలం, వెబ్ డెస్క్ : అమెరికాలో (America) ఉద్యోగాలు చేస్తున్న విదేశీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిబంధన తీసుకురానున్నట్లు సమాచారం. ముఖ్యంగా H1B వీసాపై (H-1B Visa) అమెరికాలో పనిచేస్తున్న వారికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ (Grace Period) ను తొలగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి, వీసా స్థితిని మార్చుకోవడానికి ప్రస్తుతం ఉన్న ఈ వెసులుబాటు ఎంతో ఉపయోగపడుతోంది. అయితే కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఈ అవకాశం ముగిసే పరిస్థితి ఏర్పడనుంది.
60 రోజుల గడువుకు ముగింపు?
అమెరికా ప్రభుత్వం “Eliminating the Discretionary 60-Day Grace Period” పేరుతో కొత్త నిబంధనను ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుతం కొన్ని కేటగిరీల వీసాదారులకు ఉద్యోగం కోల్పోయిన తర్వాత గరిష్ఠంగా 60 రోజుల వరకు అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉంది. ఈ సమయంలో మరో ఉద్యోగం వెతుక్కోవడం లేదా తమ వీసా స్థితిని మార్చుకునేందుకు ప్రయత్నించవచ్చు. ప్రతిపాదిత నిబంధనలో ఈ 60 రోజుల వెసులుబాటును తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగం కోల్పోయిన వెంటనే తదుపరి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వీసాదారులపై పడనుంది.
H1Bతో పాటు ఇతర వీసాలకూ వర్తింపు
ఈ మార్పు కేవలం H1B వీసాదారులకే పరిమితం కాకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం 60 రోజుల గ్రేస్ పీరియడ్‌కు అర్హత ఉన్న E1, E2, E3, H1B, H1B1, L1, O1 వంటి వీసా కేటగిరీలతో పాటు TN వీసాదారులు కూడా ఈ ప్రతిపాదన పరిధిలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన తర్వాత వెంటనే మరో సంస్థలో ఉద్యోగం సంపాదించేందుకు ప్రయత్నించే విదేశీ నిపుణులపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం దొరికే వరకు కొంత సమయం ఇచ్చే ప్రస్తుత విధానం తొలగితే, వీసాదారులు మరింత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు.
60 రోజుల్లో అభిప్రాయాల సేకరణ
ఈ ప్రతిపాదనపై ప్రజలు, సంస్థలు, సంబంధిత వర్గాల నుంచి 60 రోజులపాటు అభిప్రాయాలు స్వీకరించనున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చిన సూచనలు, అభిప్రాయాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రతిపాదన ప్రస్తుతం ప్రక్రియలో ఉన్నందున వెంటనే అమల్లోకి వచ్చినట్లు భావించకూడదు. తుది నిబంధనలు, అమలు తేదీపై అమెరికా ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.
ఒబామా హయాంలో అమల్లోకి.. ట్రంప్ హయాంలో మార్పు?
ఉద్యోగం కోల్పోయిన H1B వీసాదారులకు కొంత ఊరటనిచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్ 2016లో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఉద్యోగం కోల్పోయిన వారికి కొత్త అవకాశాన్ని వెతుక్కోవడానికి ఈ సమయం ఉపయోగపడుతోంది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఈ విధానాన్ని తొలగించే దిశగా ప్రతిపాదన తీసుకురావడం అమెరికాలోని విదేశీ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతోంది.
కొత్త నిబంధన తుది ఆమోదం పొందితే H1B వీసా గడువు ఇంకా ఉన్నప్పటికీ ఉద్యోగం కోల్పోయిన వెంటనే అమెరికాలో ఉండే అవకాశం పరిమితం కావచ్చు. దీంతో కొత్త ఉద్యోగం కోసం వేగంగా ప్రయత్నించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా H1Bపై ఆధారపడిన భారతీయ టెక్ ఉద్యోగులు వారి కుటుంబాలపై ఈ మార్పు ప్రభావం ఎలా ఉంటుందనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

