కలం, ఖమ్మం బ్యూరో: కొత్తగూడెం నగర కార్పొరేషన్‌ను అభివృద్ధి చేయకుండా, కొందరు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అనుమానాలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే కూనంనేని (MLA Kunamneni) సాంబశివరావు మండిపడ్డారు. గురువారం కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ కింద నిధులు సమీకరించామన్నారు. దీని ద్వారా పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యా సంస్థలు, క్రీడా ప్రాంగణాల వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్‌ను అర్హత సాధించేలా చేసి రూ.600 కోట్ల రుణం కోసం ప్రతిపాదనలు పంపామని స్పష్టం చేశారు.
రూ.600 కోట్ల అంచనా పనులకు వివరాలతో కూడిన ‘ప్రాజెక్టు నివేదిక (DPR) టెండర్’ ఒప్పందంలో ఏకంగా రూ.9.60 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం విమర్శకుల అజ్ఞానానికి నిదర్శనమని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని నల్గొండ, మహబూబ్‌నగర్ వంటి ఇతర మున్సిపాలిటీల్లోనూ ఇదే శాతంతో డిపిఆర్ ఒప్పందాలు కుదిరాయన్నారు. అక్కడ లేని అవినీతి కొత్తగూడెంలోనే ఎలా జరుగుతుందని నిలదీశారు. కనీసం నిధులే విడుదల కాకుండా కోట్లాది రూపాయల అవినీతికి ఆస్కారమే లేదన్నారు. అనవసర ఆరోపణలు చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, పలువురు కార్పొరేటర్లు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

