కలం, కరీంనగర్ బ్యూరో: సింగరేణి సంస్థను నామరూపాలు లేకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) అన్నారు. రామగుండం RG-1, OCP 5లోని బొగ్గు నిల్వలను మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్, టీజీబీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డితో కలిసి పరిశీలించి మాట్లాడారు. సింగరేణిలో వరుస కుంభకోణాలతో సంస్థ మనుగడే ప్రశ్నార్థకం చేసేలా దోపిడి జరుగుతోందన్నారు. ఒకప్పుడు సింగరేణి అంటే లక్షల కుటుంబాలు బతుకుదెరువు చూపించిన సంస్థ అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కుంభకోణాలకు పాల్పడుతోందన్నారు. అధికారిక లెక్కల ప్రకారం, సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు, RG -1, OCP- 5 లో 6 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు చెబుతున్నారని వివరించారు. ప్రస్తుతం 3 లక్షల 60 వేల టన్నులు అని చెబుతున్నారని, ఇక్కడ మట్టి దిబ్బలు తప్ప ఏమీ లేవన్నారు. కనీసం 50 వేల మెట్రిక్ టన్నులు కూడా ఉన్నట్లు కనిపించడం లేదన్నారు.
సీబీఐ విచారణ జరిపించాలి..
సింగరేణి సంస్థను సర్వనాశనం చేయడంతో పాటు కార్మికుల జీవితాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటలాడుతోందని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బొగ్గు నిల్వలపై సీబిఐ విచారణ జరపాలన్నారు. ఇటీవల గోదావరిఖనికి వచ్చిన హరీష్ రావు పలు విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారన్నారు. అందులో డిపెండెంట్ ఉద్యోగాల విషయాన్ని ప్రస్తావించారని, 400 మంది కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. సింగరేణిలో వరుస కుంభకోణాలపై సమగ్రి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

