కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – సర్ (SIR) ప్రక్రియ అత్యంత కీలకమైందని కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు (Boinipally Praveen Rao) అన్నారు. పారదర్శక ఓటరు జాబితా కోసమే సర్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. కొడిమ్యాల మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ‘సర్’పై ప్రవాస్ అభియాన్ ప్రోగ్రాం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రవీణ్ రావు మాట్లాడుతూ.. ప్రవాస్ అభియాన్ లో భాగంగా ప్రతి బూత్లోనూ ఓటరు జాబితా ప్రక్షాళన, ప్రక్రియ సజావుగా సాగేలా పార్టీ శ్రేణులు తగిన కృషి చేయాలన్నారు. మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, నకిలీ ఓటర్ల పేర్లను తొలగించి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ప్రవాస్ అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
రాహుల్ గాంధీపై విమర్శలు
కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశంలో అశాంతిని సృష్టించేందుకు, ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతున్నారని కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ తీవ్ర స్థాయిలో ప్రవీణ్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య ముసుగులో రాహుల్ గాంధీ చేస్తున్న దిగజారుడు రాజకీయాలు, వ్యవస్థలపై చేస్తున్న నిరాధార ఆరోపణలు దేశ ప్రజలు గమనిస్తున్నారని, నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం ఈ దేశంలో రాహుల్ గాంధీ ఆటలు సాగవని హెచ్చరించారు.
రాజకీయ డ్రామాలు చేస్తున్నారు..
ఇటీవల కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్రమంత్రి బండి సంజయ్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఆందోళనలు, గొడవ ప్రయత్నాలన్నీ రాజకీయ ఉనికి కోసమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉనికి కోల్పోయి రాజకీయ డ్రామాలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు ఆ పార్టీని ఎప్పుడో తిరస్కరించారని ఎద్దేవా చేశారు. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని ప్రవీణ్ రావు ఘాటుగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బండ నరసింహ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు బుచ్చి రాములు, అంకం పద్మ, జి. ప్రశాంత్ గౌడ్, నాంపల్లి రాజేశం, తిరుపతి, భూమేష్, ఎం. రాజ్‌కుమార్, టి.బాబు, జి. అంజి, అనిల్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Read Also: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. సజ్జనార్ కీలక ప్రకటన
Follow Us On: Sharechat

