కలం, మునుగోడు: మునుగోడు నియోజకవర్గ ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) స్పష్టం చేశారు. డిండి సాగునీటి ఎత్తిపోతల పథకంపై తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల ప్రతినిధి బృందంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన డిండి ఎత్తిపోతల పథకానికి, దానికి కొనసాగింపుగా ఉన్న మునుగోడు నియోజకవర్గ పరిధిలోని లక్ష్మణాపురం, శివన్నగూడెం రిజర్వాయర్లకు నీటిని ఎక్కడి నుండి తరలించాలనే విషయంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించి వదిలేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, తన ప్రత్యేక చొరవతో ఏదుల రిజర్వాయర్ నుండి నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
ఈ పనుల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1,800 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఏదుల రిజర్వాయర్ నుండి నీటిని తరలించే పనులు, లక్ష్మణాపురం, శివన్నగూడెం ప్రాజెక్టుల కింద ఉన్న హెడ్ వర్క్స్ పనులకు సంబంధించి ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా భూ సేకరణ, హెడ్ వర్క్స్ తో పాటు అన్ని రకాల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసేలా ప్రభుత్వంతో మాట్లాడుతానని విశ్రాంత ఇంజనీర్ల ఫోరం ప్రతినిధులకు రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం, సలహాదారులు వి. వెంకటరామారావు, ఎం. సత్తిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

