రైతు మృతిపై కోయిల్‌కొండ తహసీల్దార్ వివరణ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కోయిల్‌కొండ (Koilkonda) తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో శనివారం చోటుచేసుకున్న రైతు పసుల లావప్ప (50) మృతి ఘటనపై కోయిల్‌కొండ తహసీల్దార్ జి.దీపక్‌రావు వివరాలు వెల్లడించారు. కోయిల్‌కొండ మండలం పార్పల్లి గ్రామానికి చెందిన పసుల లావప్ప తహశీల్దార్ కార్యాలయ ఆవరణలోని చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు తహసీల్దార్ తెలిపారు. ఉదయం సుమారు 6.30 గంటలకు ఈ ఘటనపై సమాచారం అందినట్లు చెప్పారు. వెంటనే ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిబంధనల ప్రకారం ప్రాథమిక విచారణ చేపట్టిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

భూ వివాదంపై కుమారుడి వాంగ్మూలం

మృతుడి కుమారుడు పసుల కురుమూర్తి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తహసీల్దార్​ వివరాలు వెల్లడించారు. పార్పల్లి శివారులోని సర్వే నంబర్ 211లోని వ్యవసాయ భూమికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు తెలిపారు. దయ్యాలి లక్ష్మయ్య, పసుల చంద్రశేఖర్, పసుల విష్ణు, దయ్యాల రామకృష్ణ అనే వ్యక్తులు వ్యవసాయ భూమిలోకి ప్రవేశించి హద్దు రాళ్లను తొలగించేందుకు ప్రయత్నించారని, అంతే కాకుండా పంటకు నష్టం కలిగించి తన తండ్రిపై దాడికి ప్రయత్నించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని కురుమూర్తి వెల్లడించాడు. అదేవిధంగా మృతుడు రాసినట్లు పేర్కొంటున్న సూసైడ్ నోట్‌లో కొందరి పేర్లు ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు. ఆ నోట్‌లో పేర్కొన్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి కుమారుడు పోలీసులను కోరినట్లు వివరించారు. సూసైడ్ నోట్, కుటుంబ సభ్యుల వాంగ్మూలం, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

రెవెన్యూ రికార్డుల పరిశీలన

సర్వే నంబర్ 211కు సంబంధించిన రెవెన్యూ రికార్డులను పరిశీలించినట్లు తహసీల్దార్ తెలిపారు. 1954–55 ఖస్రా పహాణీ ప్రకారం సర్వే నంబర్ 211లో మొత్తం 18.39 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లు రికార్డుల్లో నమోదై ఉండగా, టిప్పన్ ఆధారంగా నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో 17.39 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ భూమికి సంబంధించిన భౌతిక స్వాధీన అంశంపై కుటుంబ సభ్యుల మధ్య వివాదం ఉన్నట్లు పేర్కొన్నారు.
సంబంధిత సర్వే నంబర్​లో పేర్కొన్న భూమికి, మృతుడికి ఎటువంటి సంబంధం లేదని తహసీల్దార్ వివరించారు.

దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు

విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం మృతుడు పసుల లావప్ప పార్పల్లి గ్రామానికి చెందిన వారని తహసీల్దార్​ వెల్లడించారు. ఆయనకు కనకమ్మ, మంజుల అనే ఇద్దరు భార్యలు ఉండగా.. వారు మృతి చెందినట్లు తహశీల్దార్ తెలిపారు. ఆయనకు వేణుగోపాల్, కుర్మయ్య, గంగాధర్ అనే ముగ్గురు కుమారులు, నాగేశ్వరమ్మ అనే కుమార్తె ఉన్నట్లు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారని తహసీల్దార్ దీపక్‌రావు తెలిపారు. సూసైడ్ నోట్, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, పోస్టుమార్టం నివేదిక, రెవెన్యూ రికార్డులు, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>