మహబూబ్‌నగర్ రైల్వే అభివృద్ధిపై కిషన్‌రెడ్డి కీలక హామీలు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో రైల్వే రంగానికి స్వర్ణయుగం ప్రారంభమైందని కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన అనంతరం కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర రైల్వే బడ్జెట్ కేటాయింపులు రూ.886 కోట్లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం తెలంగాణకు రూ.5,454 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మహబూబ్‌నగర్–కర్నూలు రైల్వే లైన్ డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయని, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రైల్వే స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి

తెలంగాణలో మొత్తం 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. రైల్వే స్టేషన్లు విమానాశ్రయాల తరహాలో ఆధునికంగా ఉండాలన్న ప్రధాని మోదీ ఆలోచనకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. 2014కు ముందు రైల్వే స్టేషన్లు అపరిశుభ్రంగా ఉండేవని, ప్రస్తుతం ‘స్వచ్ఛ రైల్వే’కు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

తెలంగాణకు ఐదు జతల వందేభారత్ రైళ్లు

తెలంగాణలో ఐదు జతల వందేభారత్ రైలు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రజలు వందేభారత్ రైళ్లను ఆదరిస్తున్నారని చెప్పారు. రైలు ప్రమాదాల నివారణకు ‘కవచ్’ వంటి ఆధునిక భద్రతా వ్యవస్థలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లకు ఆమోదం లభించిందని, వాటిలో తెలంగాణను కలుపుతూ మూడు కారిడార్లు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు, పుణే–హైదరాబాద్ మార్గాల్లో హైస్పీడ్ రైలు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుందని చెప్పారు.

మహబూబ్‌నగర్‌ రైల్వే హబ్‌గా..

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మహబూబ్‌నగర్‌ను రైల్వే హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రతిరోజూ సుమారు 9 వేల మంది ప్రయాణికులు మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌ను వినియోగిస్తున్నారని, 41 రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయని చెప్పారు. స్టేషన్ ఆధునికీకరణ పనులు ఇప్పటికే 67 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. పెరుగుతున్న రోడ్డు ట్రాఫిక్‌కు ప్రత్యామ్నాయంగా రైల్వే రవాణాను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

యాదాద్రి మెట్రో తర్వాత ఎంఎంటీఎస్‌పై పరిశీలన

యాదాద్రి మెట్రో ఫేజ్-2కు సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఆ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మహబూబ్‌నగర్‌కు ఎంఎంటీఎస్ సేవలను విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

పాలమూరు రైల్వేకు మహర్దశ: డీకే అరుణ

ప్రధాని మోదీ హయాంలో పాలమూరు రైల్వేకు మహర్దశ వచ్చిందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, పాలమూరు ప్రాంతంలో పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మహబూబ్‌నగర్–కర్నూలు డబ్లింగ్ పనులు పూర్తయితే రైళ్ల రాకపోకలు మరింత వేగవంతమై, రైల్వే కనెక్టివిటీ మెరుగుపడుతుందని పేర్కొన్నారు. రైల్వే ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయే రైతులకు న్యాయమైన పరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు.

టీడీ గుట్ట రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ)కి మంజూరు లభించిందని, త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నట్లు డీకే అరుణ వెల్లడించారు. వీరన్నపేట, బోయపల్లి ఆర్‌ఓబీలు, మోతీనగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్‌ఓబీ), దేవరకద్ర లిమిటెడ్ హైట్ సబ్‌వే పనులు ప్రక్రియలో ఉన్నాయని తెలిపారు. రైల్వే గేట్ల వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, డబ్లింగ్ పనులు, కొత్త రైలు కనెక్టివిటీ, ఆర్‌ఓబీలు, ఎఫ్‌ఓబీల నిర్మాణంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని డీకే అరుణ అన్నారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అచ్చుగట్ల అంజయ్య, కార్పొరేటర్లు కిరణ్‌కుమార్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>