షఫాలీ వార్నింగ్.. టర్నింగ్ పిచ్‌పై బ్యాటర్లకు షాక్!

కలం, స్పోర్ట్స్ : మహిళల ఆసియా కప్‌ (Women Asia Cup) లో భారత్ శుభారంభం చేసింది. థాయ్‌లాండ్‌పై 94 పరుగుల భారీ విజయం సాధించింది. అయితే ఈ గెలుపు తర్వాత భారత బ్యాటింగ్‌పై షఫాలీ వర్మ కీలక వ్యాఖ్యలు చేసింది. దుబాయ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు షఫాలీ అదిరిపోయే ఆరంభం ఇచ్చింది. ఆమె 36 బంతుల్లో 64 పరుగులు చేసింది. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో భారత్ 91 పరుగులకు ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ ఒక్కసారిగా తడబడింది. 127 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. చివరకు 20 ఓవర్లలో 159 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది.

టర్నింగ్ పిచ్‌పై థాయ్‌లాండ్ బౌలర్లు భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. హర్మన్‌ప్రీత్ కౌర్ 5, భారతి ఫుల్మాలి 13, రిచా ఘోష్ డకౌట్ కాగా.. దీప్తి శర్మ 5 పరుగులకే వెనుదిరిగారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. 65 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 94 పరుగుల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం షఫాలీ భారత బ్యాటింగ్ లోపాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పింది. టర్నింగ్ పిచ్‌పై పరిస్థితులకు తగ్గట్టు బ్యాటర్లు మరింత మెరుగ్గా ఆడాల్సి ఉందని తెలిపింది.

కొత్త బంతితో బ్యాటింగ్ సులభంగా ఉందని షఫాలీ పేర్కొంది. బంతి పాతబడిన తర్వాత పిచ్‌పై ఆగుతూ, తిరుగుతూ వచ్చిందని వివరించింది. తాను కూడా అలాంటి బంతిని ఎదుర్కొనే సమయంలో పొరపాటు చేశానని చెప్పింది. 2024 టీ20 ప్రపంచకప్ సమయంలో యూఏఈలో ఆడిన అనుభవం తనకు ఉపయోగపడిందని షఫాలీ తెలిపింది. థాయ్‌లాండ్ బౌలర్ల ప్రదర్శనకు కూడా ఆమె క్రెడిట్ ఇచ్చింది.

మహిళల క్రికెట్‌లో థాయ్‌లాండ్ వంటి జట్లు మెరుగవుతున్న తీరు సంతోషంగా ఉందని షఫాలీ పేర్కొంది. అంతర్జాతీయ క్రికెట్‌లో మరిన్ని అవకాశాలు వస్తే ఆ జట్లు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపింది. భారత్‌కు విజయం దక్కినా.. టర్నింగ్ పిచ్‌లపై బ్యాటింగ్‌ను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందనే అంశాన్ని షఫాలీ వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>