కలం, ఖమ్మం బ్యూరో: సామాజిక మాధ్యమాల్లో రౌడీ గ్యాంగుల పేరుతో భయానక పోస్టులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ యువకుడిని ఖమ్మం టాస్క్‌ఫోర్స్ పోలీసులు (Task Force Police) అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా హల్‌చల్ సృష్టిస్తున్న నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. తల్లాడ మండలం పినపాక (Pinapaka) గ్రామానికి చెందిన తెల్లపొట్ట మురళీ కృష్ణ ప్రస్తుతం ఖమ్మం బస్ డిపో ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతను తనను తాను ఒక రౌడీగా చిత్రీకరించుకుంటూ, రౌడీ గ్యాంగుల పేరుతో చలామణి అవుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా పోస్టులు పెడుతూ స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నాడు. ఈ వ్యవహారంపై నిఘా పెట్టిన ఖమ్మం టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మురళీ కృష్ణను ఖమ్మం టూ టౌన్ పోలీసులకు అప్పగించారు.
ఈ సందర్భంగా ఖమ్మం టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని రౌడీయిజాన్ని ప్రదర్శించడం, ప్రజలను భయపెట్టేలా పోస్టులు చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

