కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) కార్పొరేషన్ పాలకవర్గం గడువు మరో మూడు రోజులలో ముగియనుంది. ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన ఇంతవరకూ వెలువడని కారణంగా మే 7 న ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పాలన బాధ్యతలు చేపట్టడం లాంఛనమే అవుతుంది. ఖమ్మం కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి 43 మంది గెలవగా, కాంగ్రెస్ నుంచి కేవలం 9 మంది కార్పొరేటర్లు మాత్రమే విజయం సాధించారు. మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను హస్తగతం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి మేయర్ గా 26 వ డివిజన్ కార్పొరేటర్ పూనుకొల్లు నీరజ 2021 మే 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ మేయర్ గా 37 వ డివిజన్ కార్పొరేటర్ ఫాతిమా జోహ్రా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాగా ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్లు కేవలం 15 మందే ఉన్నారు. మేయర్ తో సహా మిగతా వాళ్ళు అంతా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. (డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ లోనే ఉన్నారు)
ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు కేబినెట్లో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో జరగబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఇప్పటికే నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ పీఠం సీపీఐ దక్కించుకున్న కారణంగా ఎలాగైనా ఖమ్మం కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మంత్రులు గట్టి పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే జిల్లా కమిటీని ప్రకటించి, వారికి బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. జిల్లా కమిటీ నియామకంలో మంత్రులు జోక్యం చేసుకోకుండా, పార్టీ కార్యకర్తల నుంచి వచ్చిన పేర్లనే ఖరారు చేసి, కష్టపడ్డ వారిని పార్టీ గుర్తిస్తుందని కేడర్లో నమ్మకాన్ని కలిగించడం గమనార్హం.
మరో పక్క కార్పొరేషన్ ను విస్తృతంగా అభివృద్ధి చేస్తూ ఇప్పటికే అనేక మౌలిక సదుపాయాలతో పాటు, సుందరీకరణ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలో రోడ్ల అభివృద్ధికి రూ.594 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో ఖమ్మం నగర పరిధిలోని రహదారులు కూడా ఉన్నాయి. ఇంకో పక్క మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కూడా, ఖమ్మం కార్పొరేషన్ ను దక్కించుకోవడానికి శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే పుట్టిన రోజు పేరు చెప్పి, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఖమ్మం నగరంలో నిర్వహించి, ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావును ఆహ్వానించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం బీఆర్ఎస్ లో మిగిలి ఉన్న కార్పొరేటర్లకు మే 2వ తేదీన సన్మానం చేసి, ఆయా డివిజన్లలో మళ్ళీ వారికి టికెట్స్ కూడా ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇన్నాళ్ళు ఖమ్మంలో కాదు గదా, కనీసం పేపర్లో కూడా కనిపించని పువ్వాడ, రానున్న ఎన్నికల నేపథ్యంలో విస్తృతంగా జిల్లా పర్యటనలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలను కలుస్తూ, వారిలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నారు. ఇంకో పక్క ఆరు గ్యారెంటీల అమలుపై, జిల్లాకు చెందిన మంత్రుల పై అనేక విమర్శలు చేస్తూ సవాళ్లు విసురుతున్నారు. మొత్తం మీద ఖమ్మం బల్దియా పీఠం ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో సరైన స్పష్టత లేకపోయినప్పటికీ, ఎప్పుడు పెట్టినా విజయం సాధించాలని అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు పన్నుతున్నారు.

