Mobile Popup Ad
Mobile Popup Ad

చెట్టుకిందే చదువు.. మబ్బులు కమ్ముకుంటే ఇంటిదారే!

కలం, ఖమ్మం బ్యూరో : ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటే చాలు.. ఆ చిన్నారుల గుండెల్లో భయం పట్టుకుంటుంది. ఉరుములు మెరుపుల శబ్దం వినబడితే చాలు.. పుస్తకాలు సంచితో ఇళ్లకు పరుగులు తీస్తుంటారు. కార్పొరేట్ వసతులతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని, నాణ్యమైన విద్యను అందిస్తామనే పాలకుల హామీ ఖమ్మం (Khammam) జిల్లా ఏనుకూరు మండలం కొత్త మేడిపల్లిలో కాగితాలకే పరిమితమైంది. పాఠశాల విద్యార్థులకు కనీస భవనం లేక, చెట్టు కిందనే చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

విద్యాశాఖ నిర్లక్ష్యం, అటవీ శాఖ రూల్స్ పాఠశాల భవిష్యత్తుకు అడ్డుగా మారాయి. శిథిలావస్థకు చేరిన పాత స్కూల్ స్థానంలో కార్పొరేట్ స్థాయిలో కట్టిస్తామని అధికారులు చెప్పి కూల్చివేశారు. కొత్తగా కట్టాలంటే అటవీ శాఖ క్లియరెన్స్ ఇవ్వడం లేదని చేతులెత్తేశారు. దీంతో కొత్త స్కూల్ భవన నిర్మాణ పనులు పునాది దశలోనే నిలిచిపోయింది. స్కూల్ లోని 36 మంది విద్యార్థులు చెట్టుకిందనే చదువుకుంటుండగా.. పాఠాలు చెప్పడానికి కూడా రెగ్యులర్ టీచర్లు లేరు. ఒక్క ఉపాధ్యాయుడే డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్నారు.

వర్షం వస్తే పిల్లలు తడిసిపోతున్నారని, అనార్యోగం బారిన పడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత స్కూలును కూల్చేసి కొత్త బిల్డింగ్ కడతామని.. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్లు ఒప్పుకోవడం లేదంటూ విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు శాఖల మధ్య ‘అనుమతి’ పంచాయితీలో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు కొత్త మేడిపల్లి విద్యార్థుల వైపు చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. అటవీ శాఖతో మాట్లాడి అనుమతుల సమస్యను పరిష్కరించి, శాశ్వత భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తిస్థాయి రెగ్యులర్ టీచర్లను నియమించి ప్రభుత్వ విద్యపై నమ్మకం కలిగించాలని గ్రామస్తులు, ఉపాధ్యాయుడు విజ్ఞప్తి చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>