కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ధాన్యం నాణ్యతను కొనుగోలు కేంద్రాల్లోనే పరీక్షించి, వెంటనే రైతులకు రశీదులు అందజేయాలని స్పష్టం చేశారు. రైస్ మిల్లుల వద్ద తరుగు పేరుతో ఎలాంటి కోతలు ఉండకూడదని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కొనుగోలు చేసిన పంటను తరలించేందుకు రవాణా కొరత రాకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఖాళీగా ఉన్న ట్రాక్టర్లు, డీసీఎంలు సహా అన్ని రకాల వాహనాలను రవాణాకు సిద్ధం చేయాలన్నారు. అవసరమైతే ప్రైవేట్ గోదాములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, కమ్యూనిటీ హాళ్లు, రైతు బజార్లను తాత్కాలిక షెడ్లుగా వాడాలని సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద తగినన్ని టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే స్థానిక హమాలీలను 100 శాతం వినియోగించుకోవాలని, ఒకవేళ ఎవరైనా హమాలీలు అధిక డబ్బు డిమాండ్ చేస్తే వారి లైసెన్సులు రద్దు చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో ఖమ్మం (Khammam) కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ.. జిల్లాలో 2.22 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగిందని, ఇప్పటికే 2.78 లక్షల టన్నుల మొక్కజొన్న కేంద్రాలకు వచ్చిందని తెలిపారు. నిల్వ కోసం అదనపు సామర్థ్యాన్ని సృష్టించి కొనుగోళ్లు వేగవంతం చేశామని సీఎంకు వివరించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలో వరి, మొక్క జొన్న కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని, ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక అధికారులను నియమించి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం కి వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

