కలం, వెబ్ డెస్క్: పార్టీ ఫిరాయింపు కేసు విచారణలో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) అనర్హత పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. తీర్పు వాయిదా వేసింది. తదుపరి విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారానికి (సెప్టెంబర్ 18) వాయిదా వేసింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పలు కీలక పరిణామాల అనంతరం సుప్రీం కోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన స్పీకర్.. చట్టపరంగా దానం పార్టీ మారలేదని వెల్లడించారు. ఈ తీర్పును తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్, బీజేపీ.. తదుపరి చర్యలు తీసుకుంది.
స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీజీపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఆగస్టు 21న విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇరుపక్షాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేశారు. తాజాగా ఈ పిటిషన్ పై న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు, లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. శుక్రవారానికి తీర్పు వాయిదా వేసింది.

