కలం, వెబ్ డెస్క్ : నెల్లూరు నగరం, మూలపేటలోని (Mulapeta) డీఎస్ఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆధునీకరించిన భవనాన్ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ప్రారంభించారు. డీఎస్ఆర్ గ్రూప్ సీఎస్‌ఆర్ నిధులతో రూ.13.41 కోట్ల పెట్టుబడితో పాఠశాలను ఆధునీకరించడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మంచి పాఠశాలలు బలమైన, ఆరోగ్యకరమైన సమాజానికి పునాదులని లోకేశ్ పేర్కొన్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంలో ప్రభుత్వంతో పాటు సంస్థలు కూడా భాగస్వాములు కావాలని అన్నారు. సీఎస్‌ఆర్ నిధులతో పాఠశాలను పూర్తిగా రూపాంతరం చేసిన డీఎస్ఆర్ గ్రూప్‌కు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. మూలపేట డీఎస్ఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చేపట్టిన ఆధునీకరణ పనులతో విద్యార్థులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వచ్చాయి. పాఠశాల రూపురేఖల్లో వచ్చిన మార్పును స్వయంగా పరిశీలించాలని లోకేశ్ సూచించారు.

