కలం, వెబ్ డెస్క్: ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం తాత్కాలిక నిలిచిపోయింది. హర్మూజ్ జల సంధి తెరిచే ఉంది.. భారత నౌకలు వస్తూ పోతున్నాయి. దేశానికి సరిపడా చమురు రవాణా యథావిధిగా కొనసాగుతూనే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి, ఉన్నట్లుండి ఎందుకీ.. పెట్రోల్, డీజిల్ కొరత (Fuel Shortage).. ఎక్కడా చూసినా నో స్టాక్ బోర్డులు ఎందుకు కనిపిస్తున్నాయి.. అనే ప్రశ్నలు సహజంగానే వినియోగదారుల నుంచి వస్తున్నాయి. ఈ కొరత వెనుక ఆయిల్ కంపెనీల భారీ కుట్ర దాగి ఉందనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
నష్టాలు వస్తున్నాయని..
అంతర్జాతీయ చమురు ధరలు పెరిగినా.. భారత్ లో పెరగకపోవడంతో కొంతకాలంగా ఆయిల్ కంపెనీలకు నష్టాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదును చూసి.. అన్ని ఆయిల్ కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించాయి. దీంతో ఆయిల్ ట్యాంకర్లు డిపోల్లోనే ఆగిపోయాయి. అడ్వాన్స్ చెల్లించినా, ఆయిల్ కంపెనీలు స్పందించడం లేదని డీలర్లు మొత్తుకుంటున్నారు. హైదరాబాద్ లో ఒక డీలర్ రూ.25 లక్షలు వారం ముందే చెల్లించినా.. డీజిల్ మాత్రం సరఫరా కాలేదు. దీంతో, బంక్ మూసివేయాల్సిన పరిస్థితి. మరోవైపు బెంగాల్ రెండో విడత ఎన్నికలు ముగిసిన వెంటనే.. కేంద్ర ప్రభుత్వం భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబోతుందనే వార్తలొచ్చాయి. అప్పటివరకు నామమాత్రంగానే చమురు సరఫరా చేస్తూ.. రేట్లు పెంచాక సరఫరాను మళ్లీ భారీగా పెంచి నష్టాలను పూడ్చుకునే ఎత్తుగడలో ఆయిల్ కంపెనీలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. మొత్తం వ్యవహారంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటనలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

