కలం, కరీంనగర్ బ్యూరో : ‘మండే’ వేసవిలో రాజకీయ వేడి రాజుకుంది. అందుకు ఇద్దరు ఉద్దండులైన జగిత్యాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR), మేడిగడ్డకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రావడం మరింత కాక పుట్టిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకే రోజున ఒకే సమయంలో బహిరంగ సభల్లో పాల్గొననుండడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరనున్న సందర్బంగా జగిత్యాల కేంద్రంగా రేపు(20వ తేదీన) భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు కేసీఆర్ (KCR) రావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోగా సభ విజయవంతానికి పార్టీ యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సైతం జగిత్యాల వేదికగా ఉమ్మడి జిల్లా నుంచి జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు ఇదే రోజు మేడిగడ్డ రిజర్వాయర్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటన ఖరారు కాగా కాటారం మండలం నస్తూరిపల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు జనసమీకరణపై మంతనాలు చేస్తున్నారు. ఇరు పార్టీలు (అధికార, ప్రతిపక్ష) జనసమీకరణ చేస్తుండడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ మలి దశ ఉద్యమం కరీంనగర్ నుంచే ప్రారంభమైంది. కరీంనగర్ నుంచి మూడు సార్లు ఎంపీగా కేసీఆర్ గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తూర్పు ప్రాంతాల్లో పర్యటిస్తుండగా మాజీ సీఎం కెసిఆర్ పశ్చిమాన జగిత్యాలలో పర్యటిస్తుండడం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఆసక్తి రేపుతున్నాయి. సీఎం, మాజీ సీఎం పర్యటనలు ఒకే రోజు ఉండడంతో ప్రజల దృష్టి పూర్తిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పైనే ఉంది. జగిత్యాలలో జరిగే ఆత్మగౌరవ సభకు కేసీఆర్ హాజరు కానుండడంతో ముఖ్య నేతలందరూ ఇప్పటికే జగిత్యాలలో మకాం వేశారు. గత ఏడాది పార్టీ ప్లీనరీకి హాజరైన కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత బహిరంగ సభలో పాల్గొననుండడంతో నేతలందరూ భారీ జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజకీయ ఆయుధంగా మేడిగడ్డ బరాజ్..
భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నుస్తూరిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అంతకుముందు మేడిగడ్డ రిజర్వాయర్ ను పరిశీలించి అధికారులతో సమీక్షించిన అనంతరం సీఎం కాటారం మండలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్బంగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. సీఎంతో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఇతర మంత్రివర్గ సహచరులు, రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు. మేడిగడ్డ బరాజ్ అంశం రాజకీయ ఆయుధంగా మారింది.
బరాజ్ కుంగిన ఘటనను పరిశీలించడానికే సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించారంటూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రచార ఆయుధంగా లబ్ది పొందింది. కాటారం సభలో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి మాదిరిగానే బీఆర్ఎస్ పై మాటల దాడి, అవినీతి ఆరోపణలు, ప్రజలకు వాగ్దానాలు ప్రజల ముందుకు తెచ్చే అవకాశాలున్నాయి. గత ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సిద్దమవుతుండగా ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తన బలాన్ని చాటుకునేందుకు సంసిద్ధమతోంది. కేసీఆర్ జగిత్యాలలో చేసే ప్రసంగంలో భవిష్యత్ వ్యూహాన్ని వెల్లడించే అవకాశముంది. ఎండలో ఉమ్మడి జిల్లా నుంచి జనసమీకరణ విషయంలో ఇరు పార్టీలకు ఇబ్బందులు ఎదురైనా అటు కేసీఆర్ మాట్లాడే మాటల గారడీ.. ఇటు రేవంత్ రెడ్డి వేసే డైలాగుల కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

