కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్‌రెడ్డి పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి (Prashanth Reddy) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. పోలీసులను, గూండాలను అడ్డం పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రిపై దాడులు చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు సహించరని హెచ్చరించారు. కేసీఆర్ (KCR) ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే అధికారులను ఉపయోగించుకుని ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థులపై విధానపరంగా, ప్రజల మధ్య పోరాడాలి తప్ప వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం సరికాదని హితవు పలికారు.
కేసీఆర్ ఇంటి వద్ద గూండాలతో మాకాం..
కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యకలాపాలకు హాజరుకాకుండా కేసీఆర్ ఇంటి వద్దకు వెళ్లి గూండాలతో మకాం వేశారని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీని వదిలి రాజకీయ ప్రత్యర్థి ఇంటి వద్దకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యవహారం అధికార పార్టీ రాజకీయ వైఖరిని స్పష్టం చేస్తోందని ఆయన (Prashanth Reddy) విమర్శించారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు : ప్రశాంత్‌రెడ్డి
తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నా చట్టపరమైన, ప్రజాస్వామ్య మార్గాల్లోనే వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని ఉపయోగించి ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూస్తే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పాటించాలని ఆయన సూచించారు. కాగా, ప్రశాంత్‌రెడ్డి తాజా వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య కొనసాగుతున్న రాజకీయ విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.

