కలం, రాజన్న సిరిసిల్ల: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు గత ప్రభుత్వంలో నెరేళ్లలో జరిగిన దాష్టీకం మొత్తం తెలంగాణ సమాజం తల దించుకునే సంఘటన అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. సంఘటన జరిగి దాదాపు 9 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కూడా ఈ దాష్టీకానికి పాల్పడిన ఒక్క పోలీసుకు గానీ ధన దాహంతో పేదల ప్రాణాలు తీసిన పెద్దలకు గానీ ఎందుకు శిక్ష పడలేదని ప్రశ్నించారు. నేరెళ్లలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో ఆనారోగ్యం పాలై ఇటీవల చనిపోయిన గంధం గోపాల్ కుటుంబాన్ని మంగళవారం కవిత పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఈ సంఘటన జరిగినప్పుడు తాను కూడా భాగస్వామిగా ఉన్నందుకు సిగ్గుతో తలదించుకోని క్షమాపణ అడుగుతున్నానని అన్నారు. బాధితులను ఏదో టూరిస్టులు వచ్చి పరామర్శించినట్లు కాకుండా వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతానని కవిత చెప్పారు. బాధితులందరికీ కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్ ఏం చేస్తున్నారు?
కొంతమంది ధన దాహాం కారణంగా నెరేళ్ల నేల నెత్తురుతో తడిచిందని, ఇసుక కోసం ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కన్నా ప్రాణాలు పలుచన అయ్యాయా అంటూ ప్రశ్నించారు. ఇసుక లారీల కారణంగా ఒక బిడ్డ ప్రాణం పోతే…దానికి నిరనస చేపట్టినందుకు 8 మందిని ఐదు రోజుల పాటు చిత్ర హింసలకు గురి చేసి కొట్టారని కవిత గుర్తు చేశారు. చివరకు జైలర్ కూడా వారి దెబ్బలు చూసి జైల్లోకి తీసుకోనని చెబితే ఈ సంఘటన బయటకు వచ్చిందన్నారు. “ఈ సంఘటను వాడుకోని ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లను నేను ప్రశ్నిస్తున్నా. దాష్టీకానికి పాల్పడిన ఒక్క పోలీసుకైనా శిక్ష పడిందా? జాతీయ ఎస్సీ కమిషన్ ను తీసుకొచ్చిన బండి సంజయ్ గారు ఆ రిపోర్ట్ ఏమైందో చెప్పాలి”. అని కవిత డిమాండ్ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ బాధితులకు ఎందుకు న్యాయం చేయటం లేదని కవిత ప్రశ్నించారు. ఎస్పీ పై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశిస్తే ఓ ఎస్సైని బలి చేసి.. మిగతా పోలీసులను కాపాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో రాజకీయాలు మాని అన్ని పార్టీలు బాధితులకు న్యాయం జరిగేందుకు పోరాటం చేయాలని కవిత పిలుపునిచ్చారు. తాము టూరిస్ట్ ల మాదిరిగా కాకుండా బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామన్నారు. అన్ని పార్టీలు కూడా బాధితులకు ఏదో విధంగా సాయం చేయాలని కోరారు. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కోసం అవసరమైతే బాధితులతో కలిసి ఢిల్లీ వరకు వెళ్తామన్నారు. తెలంగాణ రక్షణ సేన అని తమ పార్టీ పేరును ఊరికే పెట్టుకోలేదని తెలంగాణను రక్షించుకునేందుకు ఆ పేరు పెట్టుకున్నామని చెప్పారు.
30 నెలలుగా నెరేళ్ల బాధితుల పేరెత్తని సీఎం
నెరేళ్ల బాధితులను వాడుకోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓట్లు వేయించుకున్నారని కవిత ఆరోపించారు. కానీ గెలిచి 30 నెలలు గడుస్తున్న నెరేళ్ల పేరెత్తటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత మానవత్వం లేకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. “నెరేళ్ల బాధితుల కన్నీళ్ల పునాదులపై మీరు అధికారం సాధించారు. న్యాయం జరిపిస్తామంటూ మీరా కుమార్ ను కూడా అప్పట్లో ఇక్కడకు తీసుకొచ్చారు. పొన్నం ప్రభాకర్, భట్టి, అడ్లూరి లక్ష్మణ్ మీ మానవత్వం ఏమైంది?” అంటూ కవిత నిలదీశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు.
చనిపోయిన గోపాల్ కుటుంబం 9 ఏళ్ల పాటు హాస్పిటల్స్ చుట్టు తిరిగి లక్షల రూపాయలు ఖర్చు చేశారని కవిత విచారం వ్యక్తం చేశారు. గోపాల్ కుటుంబంతో పాటు నెరేళ్ల బాధితులందరికీ కోటి రూపాయల పరిహారం చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. దాష్టీకానికి పాల్పడిన పోలీసులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటేనే ప్రజలను కొట్టొద్దని పోలీసులకు భయం ఉంటుందన్నారు. తెలంగాణ ఆడబిడ్డగా ఎట్టి పరిస్థితుల్లో నెరేళ్ల బాధితులకు జరిగిన అవమానం పై పోరాటం ఆపేది లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కవిత కోరారు.
నేరెళ్ల బాధితులకు పరామర్శ
పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో తీవ్రంగా గాయపడిన బాధితులను కవిత పరార్శించారు. బాధితుడు బానయ్య నివాసంలో హరీశ్ సహా ఇతర బాధితులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నేరెళ్ల బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

