కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్ జెండర్స్ (Transgenders)కు కో-ఆప్షన్ సభ్యులుగా ప్రాతినిధ్యం కల్పించే బిల్లును శాసనసభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నిర్ణయంతో పురపాలక పరిపాలన, విధాన నిర్ణయాల్లో ట్రాన్స్ జెండర్ల భాగస్వామ్యానికి మార్గం సుగమమైంది.
శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ‘తెలంగాణ మున్సిపాలిటీల (నాలుగో సవరణ) బిల్లు–2026’ను సభలో ప్రవేశపెట్టారు. 2019 నాటి తెలంగాణ మున్సిపాలిటీల చట్టానికి ఈ బిల్లు పలు సవరణలను ప్రతిపాదించింది. ఈ సవరణలతో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) వెలుపల ఉన్న వరంగల్, కరీంనగర్ వంటి తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లలో ఒక్కో ట్రాన్స్ జెండర్ ను నామినేటెడ్ సభ్యుడిగా కో-ఆప్ట్ చేసుకునే అవకాశం కలుగుతుంది.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సామాజిక వివక్షకు, వెలివేతకు గురవుతున్న ట్రాన్స్ జెండర్లను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంతో పాటు, ప్రజా జీవితంలో వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగానే ఈ సంస్కరణలు చేపట్టినట్లు చెప్పారు. ఈ బిల్లుకు బీజేపీ, సీపీఐతో పాటు ఇతర పార్టీల సభ్యులు మద్దతు ప్రకటించారు. అనంతరం శాసనసభ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది.

