కలం, నేషనల్ డెస్క్: బ్రిక్స్ సదస్సు (BRICS Summit)లో భాగంగా అమెరికా డాలర్‌కు దూరం జరిగే విషయంలో న్యూఢిల్లీ స్పష్టమైన వైఖరితో ఉంది. చైనా, రష్యా, ఇరాన్ వంటి దేశాలు డీ-డాలరైజేషన్ను వ్యూహాత్మక ప్రాజెక్టుగా ముందుకు తీసుకెళ్తుండగా.. భారత్ మాత్రం డాలర్ పూర్తిగా పక్కనపెట్టడం తమ ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక విధానంలో భాగం కాదని స్పష్టం చేస్తోంది. అదే సమయంలో బ్రిక్స్ దేశాల మధ్య చెల్లింపులను సులభతరం చేసేందుకు డిజిటల్ కరెన్సీ ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది.
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల (సీబీడీసీ) అనుసంధానానికి భారత్ ప్రయత్నిస్తోంది. బ్రిక్స్ కూటమి(BRICS Summit)లో ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు చేరడంతో ఆర్థిక వైవిధ్యం పెరిగిందని, ఇలాంటి స్థితిలో అందరికీ కలిపి ‘ఉమ్మడి కరెన్సీ’ తేవడం ఆచరణ సాధ్యం కాదని న్యూఢిల్లీ భావిస్తోంది. ఉమ్మడి కరెన్సీ వస్తే అది చైనా ‘యువాన్’ ఆధిపత్యానికే దారితీస్తుందనే ఆందోళన కూడా ఉంది.
రూ.19 లక్షల కోట్ల వాణిజ్య లోటు..
భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన ఆర్థిక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిక్స్ దేశాలతో ఇండియాకు సుమారు 226 బిలియన్ డాలర్ల (రూ.19 లక్షల కోట్లు) భారీ వాణిజ్య లోటు ఉంది. అంటే ఆ దేశాల నుంచి మన దేశానికి ఎక్కువగా దిగుమతులు చేసుకుంటూ, తక్కువగా ఎగుమతులు చేస్తోంది. ఇలాంటి స్థితిలో డాలర్‌ను కాదని స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం సాగిస్తే భాగస్వామ్య దేశాల వద్ద రూపాయిలు విపరీతంగా పేరుకుపోతాయి.
గతంలో రష్యాతో జరిపిన రూపాయి-రూబుల్ వాణిజ్యంలోనూ రష్యా వద్ద రూపాయి నిల్వలు పేరుకుపోయి ఇదే సమస్య ఎదురైంది. ఈ నేపథ్యంలో భారత్ డాలర్ పూర్తిగా వదిలేయడం కాకుండా.. అవసరమైన చోట డాలర్, అనుకూల మార్గాల్లో స్థానిక కరెన్సీలు, ఎంపిక చేసిన మార్గాల్లో సీబీడీసీ అనుసంధానం వంటి బహుళస్థాయి విధానాన్ని అనుసరించనుంది.
Also Read : బ్రిక్స్ సదస్సు.. ప్రత్యేక ఆకర్షణగా పుతిన్ విమానాలు, కారు
Follow Us On: X(Twitter)

