Mobile Popup Ad
Mobile Popup Ad

రైతు సమస్యలపై పోరాడితేనే ప్రభుత్వంలో చలనం: టీఆర్ఎస్ చీఫ్ కవిత

కలం, నల్లగొండ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, అన్నదాతల సమస్యలపై పెద్ద ఎత్తున రోడ్డెక్కి పోరాటం చేస్తే గానీ ఈ ప్రభుత్వంలో చలనం రాదని తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) పిలుపునిచ్చారు. నల్గొండలో నిర్వహించిన “రైతు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం”లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మేధావులకు, విప్లవాలకు అడ్డా అయిన నల్గొండ నుంచే రైతు పోరాట కార్యాచరణను ప్రారంభిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తమ పార్టీ కొత్తగా ఏర్పాటైనప్పటికీ.. ఉచిత విద్య, వైద్యం, రైతుకు గౌరవం, యువతకు ఉపాధి, సామాజిక న్యాయం అనే పాంచజన్యం లక్ష్యాలతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి పదవిలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించలేదని కవిత తీవ్రంగా విమర్శించారు. “సీఎం పర్యవేక్షణే లేకపోతే అధికారులకు భయం ఎందుకు ఉంటుంది? ఇప్పటికే మూడుసార్లు రైతు భరోసాను ఎగ్గొట్టారు. రుణమాఫీ సగం మందికి కూడా కాలేదు” అని మండిపడ్డారు. మృగశిర కార్తె వచ్చి మళ్లీ పంట పెట్టుబడులకు సమయం ఆసన్నమైనా ప్రభుత్వం రైతు భరోసా సాయం వేయకపోవడంతో, రైతులు తమ భార్యల పుస్తెలు తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయ అవసరాల కోసం రైతు భరోసా వేయాలని ప్రభుత్వం చూస్తోందని, ఈ కుట్రను రైతులు గమనించాలని కోరారు.

ధాన్యం కొనుగోళ్లలో భారీ మోసం

75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం, క్వింటాకు 6 కిలోల తరుగు తీస్తూ రైతులకు భారీ నష్టం చేసిందని కవిత ఆరోపించారు. రవాణా భారం కూడా రైతులపైనే వేశారన్నారు. తాము వస్తుండగా సంస్థాన్ నారాయణపూర్ వద్ద ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో గింజలు మొలకెత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, అందుకే రైతుల పరిస్థితి సీఎంకు తెలియజెప్పేందుకే తాము సెక్రటేరియేట్ వద్ద ధాన్యం పోసి ఆందోళన చేశామని గుర్తు చేశారు. నల్గొండ జిల్లాలో రిజర్వాయర్లు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నల్గొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా.. సీఎం మాత్రం కేవలం పాలమూరు గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు. దిండి ప్రాజెక్టు సోర్స్ పాయింట్ కారణంగా మహబూబ్ నగర్, నల్గొండ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే ప్రమాదం ఉందని, వెంటనే దాని సోర్స్ పాయింట్‌ను మార్చాలని డిమాండ్ చేశారు.

మంత్రుల అసైన్డ్ భూముల దందా

అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఇండస్ట్రీస్ పేరుతో ఆ భూములను లాక్కుంటోందని కవిత ఆరోపించారు. నల్గొండ జిల్లాకు చెందిన ఒక మంత్రి హైదరాబాద్ పరిసరాల్లో దాదాపు 200 ఎకరాల అసైన్డ్ భూములను కొని పెట్టుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల చివరి సంవత్సరంలో అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తారనే లీకులతో, మంత్రులంతా ముందే ఆ భూములను కొని పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. రైతులు తమ అసైన్డ్ భూములను కాపాడుకోవడానికి కూడా పోరాడాల్సిన దుస్థితి వచ్చిందన్నారు.

రైతులకు ఇచ్చే ఉచిత కరెంట్‌ను ఎత్తివేసేందుకు ప్రభుత్వం “రైతు డిస్కం” పేరుతో పెద్ద కుట్ర చేస్తోందని కవిత హెచ్చరించారు. ఒక డిస్కంను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎవరితోనూ చర్చించకుండానే ప్రభుత్వం ఈఆర్సీకి అప్లికేషన్ పెట్టుకుందని ధ్వజమెత్తారు. ఈఆర్సీ పబ్లిక్ హియరింగ్‌లో ఈ విషయం బయటపడిందన్నారు. రైతు డిస్కంపై ప్రతి ఒక్కరూ మాట్లాడాలని, దీనిపై మేధావులు, రైతులు తమ పార్టీకి సలహాలు, సూచనలు ఇవ్వాలని కవిత కోరారు. పిడికెడు మందితో ప్రారంభమై చరిత్ర తిరగరాసిన వాళ్లు ఎందరో ఉన్నారని, తమ కొత్త పార్టీ కూడా రైతుల పక్షాన రాజీలేని పోరాటం చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>