కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి (Karthika Pournami ) వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పవిత్ర పున్నమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, కృష్ణమ్మకు కార్తీక దీపాలు వదులుతూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది.
అటు విజయవాడలోని దుర్గాఘాట్ వద్ద కూడా కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఇదిలాఉంటే కార్తీక మాసం వేళ శ్రీశైల మహాక్షేత్రంలో గత రెండు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా రద్దీ రోజుల్లో అందరికీ త్వరితగతిన దర్శనం కల్పించేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కార్తీక మాసం పొడవునా ప్రతి శని, ఆది, సోమవారాల్లో స్పర్శ దర్శనంతో పాటు సామూహిక, గర్భాలయ అభిషేకాలను పూర్తిగా రద్దు చేశారు. కేవలం సోమవారాల్లో భక్తులకు అలంకార దర్శనం మాత్రమే అనుమతిస్తుండగా, మంగళవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 4 విడతల్లో స్పర్శ దర్శనం అందుబాటులో ఉంటుందని ఆలయ ఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

