కలం, వెబ్ డెస్క్: కర్ణాటకలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలకు సీఎం డీకే శివకుమార్ (CM DK Shivakumar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు మంత్రులు కూడా తమను సంప్రదిస్తున్నారని.. ఓకే అంటే త్వరలోనే వారు తమ పార్టీలో చేరుతారని కూడా స్పష్టం చేశారు. విజయేంద్ర చేసిన వ్యాఖ్యలతో కన్నడ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే స్పందించిన సీఎం డీకే శివకుమార్ దమ్ముంటే తమ వారిని టచ్ చేయాలని సవాల్ చేశారు.
ఒక్క ఎమ్మెల్యే, మంత్రిని అయినా తీసుకెళ్లాలని సీఎం డీకే శివకుమార్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలు అభద్రతభావంలో ఉన్నారని.. పార్టీని నడుపుకోవడానికి ఇలాంటి బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి సరిపడా మెజార్టీ ఉందని.. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ అసంతృప్తితో లేరన్నారు. ఇదిలా ఉంటే, సిద్ధరామయ్య నుంచి ముఖ్యమంత్రి పగ్గాలు డీకే శివకుమార్‌కు వచ్చిన కొద్ది నెలల్లోనే బీజేపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం వేస్తోందా.. అనే చర్చ జోరుగా జరుగుతోంది.

