కరీంనగర్‌లో రూ.630 కోట్లతో 50 కి.మీలకుపైగా రోడ్లు!

కలం, కరీంనగర్: కరీంనగర్‌కు కేంద్రం మంజూరు చేసిన రూ.840 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ – యూసీఎఫ్ (UCF) నిధులతో నగర రూపు రేఖలు మార్చి అభివృద్ధిలో రాష్ట్రంలోనే రోల్ మెడల్ గా నిలపాలని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) నిర్ణయించారు. అందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం కరీంనగర్ ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌజ్‌లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఎస్ఈ సంపత్ రావు, డీఈ దేవేందర్ రెడ్డి, తదితరులతో ఆయన సమావేశమయ్యారు. ఈ మేరకు యూసీఎఫ్ పనులకు సంబంధించి రూపొందించిన ప్రతిపాదనలపై చర్చించారు.

గీతాభవన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్..

ఈ సందర్భంగా ఆయా ప్రతిపాదనలను (Karimnagar Roads) వారు కేంద్ర మంత్రి ముందుంచారు. రూ.630 కోట్లతో కరీంనగర్ లో 40 పీట్లు అంతకంటే ఎక్కువ మోడల్ రోడ్లను 50 కి.మీల మేరకు నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. దీంతోపాటు జిల్లా కోర్టు, సివిల్ ఆసుపత్రి, గీతాభవన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను, కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద స్కై వాక్ (హైదరాబాద్ ఉప్పల్ తరహాలో)ను నిర్మించేందుకు డిజైన్లు రూపొందించినట్లు తెలిపారు. అలాగే నగరంలోని ట్రాఫిక్ జంక్షన్లను గుర్తించి వాటిని కూడా సుందరంగా అభివృద్ధి చేస్తామన్నారు. దీంతోపాటు 130 ఎలక్ట్రిక్ వాహనాలను కూడా కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

డ్రైనేజీ కాలువల అభివృద్ధి..

నగరంలో చిన్నపాటి వర్షానికే అక్కడక్కడా రోడ్లపై నీరు చేరి ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నందున ఆ సమస్య పరిష్కారానికి రూపొందించిన ప్రతిపాదనలను అడిగి తెలుసుకున్నారు. నగరంలో వర్షపు నీటిని తరలించేందుకు మొత్తం 80 కిలోమీటర్ల పొడవునా డ్రైనేజీ కాలువలను (Storm Water Drains) నిర్మించి అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ముందుంచారు.

డంపింగ్ యార్డ్ పై చర్చ..

కరీంనగర్ లో ప్రధాన సమస్యగా మారిన డంపింగ్ యార్డ్ అంశం శాశ్వత పరిష్కారం కోసం రూపొందించిన ప్రతిపాదనల వివరాలను సైతం కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్నారు. యూసీఎఫ్ నిధుల్లో భాగంగా రూ.80 కోట్లతో డంపింగ్ యార్డ్ శాశ్వత పరిష్కారానికి సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. “నగరంలో ఉత్పత్తయ్యే చెత్తను సేకరించి ప్రాసెసింగ్ కేంద్రంలో వేరు చేసి, రీసైకిల్ చేసి శాస్త్రీయంగా పారవేయడం కోసం “ఘన వ్యర్థాల సమగ్ర నిర్వహణ ప్రాజెక్టు – బదిలీ కేంద్రం, ప్రాసెసింగ్ యూనిట్” ను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపినట్లు తెలిపారు.

కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి..

ఆయా ప్రతిపాదనలపట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్, రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీదేవి, ఈఎన్ సీ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. యూసీఎఫ్ ప్రతిపాదనలను యుద్ద ప్రాతిపదికన ఆమోదించి టెక్నికల్ శాంక్షన్స్ మంజూరు చేయాలని కోరారు. ప్రతిపాదనలు అమోదం పొందిన వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి యూసీఎఫ్ నిధులతో ఆయా అభివృద్ధి పనులను చేపట్టాలని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.

పోచమ్మవాడలో అభివృద్ధి పనులు..

యూసీఎఫ్ నిధులతో కరీంనగర్ రూపురేఖలు మారిపోతాయని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధిలో కరీంనగర్ ను తెలుగు రాష్ట్రాల్లోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను కోరారు. అంతకుముందు కోతిరాంపూర్ లోని 39వ డివిజన్ పోచమ్మవాడలో రోడ్లు, డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్ అభివృద్ధి పనులకు మేయర్, డిప్యూటీ మేయర్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>