కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని సీతారాంపూర్ శివారులో గల ‘మేలకుంట శిఖం’ ప్రభుత్వ భూమిని (సర్వే నెం. 71, 72) అక్రమ కబ్జాల నుండి కాపాడాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో కరీంనగర్ రెవిన్యూ డివిజన్ అధికారికి (RDO) ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను, ప్రభుత్వ నివేదికలను అధికారులు బేఖాతరు చేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీతారాంపూర్ శివారులోని సర్వే నెం. 71, 72 లో గల 13 ఎకరాల 26 గుంటల మేలకుంట శిఖం ప్రభుత్వ భూమి భారీగా కబ్జాకు గురైంది. తప్పుడు పత్రాలతో మున్సిపాలిటీ నుండి అనుమతులు పొంది ప్రైవేట్ భవనాలు, అపార్ట్మెంట్లు, విద్యాసంస్థలు, ఫంక్షన్ హాళ్లు నిర్మించారని ఆరోపించారు.
డిసెంబర్ 22వ తేదీ 2023వ సంవత్సరంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ ఆధ్వర్యంలో కొత్తపల్లి, చొప్పదండి, కరీంనగర్ రూరల్ సర్వేయర్లతో కూడిన ఉమ్మడి బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. దాదాపు 40 మందికి పైగా అక్రమార్కులు ఇక్కడ నివాసాలు, బేస్మెంట్లు నిర్మించినట్లు ప్రభుత్వ నివేదికే స్పష్టం చేసింది. రెవెన్యూ అధికారులే ఇవి అక్రమ కట్టడాలని తేల్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇంకా చెరువును, నాలాను కబ్జా చేస్తూ అపార్ట్మెంట్లు, రోడ్ల నిర్మాణాలు నిరంతరాయంగా సాగుతూనే ఉన్నాయి.
మునిగిపోతున్న కాలనీలు – ప్రజల ఇబ్బందులు
చెరువు, నాలాలు కబ్జా అవ్వడం వల్ల స్వల్ప వర్షానికే ఆర్టీసీ వర్క్‌షాప్ సమీపంలోని సూర్యనగర్ కాలనీ పూర్తిగా జలమయమవుతోంది. కరీంనగర్ – జగిత్యాల రోడ్డు చెరువును తలపిస్తుండటంతో వాహనాలను దారి మళ్లించాల్సి వస్తోంది. అధికారులందరికీ తెలిసే ఈ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అపార్ట్మెంట్లు, భవన నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని, అక్రమ కట్టడాలను కూల్చివేసి, మేలకుంట చెరువును, ప్రభుత్వ భూమిని రక్షించాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామెర బద్రి నేత ఉన్నారు.

